నేడే ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌.. 10 గంట‌ల నుంచి పోలింగ్ ప్రారంభం

Vice Presidential Election 2022 Polling to be held today.భార‌త ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక నేడు జ‌ర‌గ‌నుంది. శ‌నివారం ఉద‌యం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Aug 2022 3:03 AM GMT
నేడే ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌.. 10 గంట‌ల నుంచి పోలింగ్ ప్రారంభం

భార‌త ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక నేడు జ‌ర‌గ‌నుంది. శ‌నివారం ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పార్ల‌మెంట్ భ‌వ‌నం మొద‌టి అంత‌స్తులోని రూమ్ నెం 63లో పోలింగ్ కొన‌సాగ‌నుంది. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఈ పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ప్ర‌స్తుత ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు ప‌ద‌వీకాలం ఆగ‌స్టు 10తో ముగియ‌నున్న నేప‌థ్యంలో నేడు ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఎన్టీఏ కూట‌మి త‌రుపున ప‌శ్చిమ బెంగాల్ మాజీ గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌, విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా మాజీ కేంద్ర మంత్రి, గ‌వ‌ర్న‌ర్ మార్గ‌రెట్ అల్వా బ‌రిలో ఉన్నారు.

లోక్‌స‌భ‌కు చెందిన 543, రాజ్య‌స‌భ‌కు చెందిన 245 మంది ఈ ఎన్నిక‌లో త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకోనున్నారు. అయితే.. ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ‌లో జ‌మ్ముక‌శ్మీర్ నుంచి 4, త్రిపుర 1, నామినేటెడ్ స‌భ్యుల నుంచి 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అంటే మొత్తం 780 మంది ఓట్లు వేసే అవ‌కాశం ఉండ‌గా.. ఈ ఎన్నిక‌కు దూరంగా ఉండాల‌ని తృణ‌ముల్ కాంగ్రెస్ నిర్ణ‌యించింది. దీంతో 744 మంది ఓటింగ్ లో పాల్గొనున్నారు. పోలింగ్ ముగిసిన వెంట‌నే ఓట్ల లెక్కింపు, ఫ‌లితాలు వెల్ల‌డించ‌నున్నారు. ఈ నెల 11న‌ కొత్త ఉప రాష్ట్ర‌ప‌తి ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు.

ఎన్డీయే కూట‌మికి సంఖ్యా బ‌లం ఎక్కువ‌గా ఉంది. దీంతో ఎన్డీయే అభ్య‌ర్థి జగదీప్ ధన్‌కర్‌ కు గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయ‌న‌కు 515 ఓట్లు వ‌స్తాయ‌ని అంచ‌నా.

Next Story