నిద్ర‌లేని రాత్రి గ‌డిపా.. రాజ్య‌స‌భ‌లో వెంకయ్య‌నాయుడు కంట‌త‌డి

Venkaiah Naidu breaks down over ruckus in Rajya Sabha.రాజ్యసభలో విప‌క్షాలు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై చైర్మ‌న్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Aug 2021 1:34 PM IST
నిద్ర‌లేని రాత్రి గ‌డిపా.. రాజ్య‌స‌భ‌లో వెంకయ్య‌నాయుడు కంట‌త‌డి

రాజ్యసభలో విప‌క్షాలు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై చైర్మ‌న్, ఉపరాష్ట్రపతి వెంక‌య్య నాయుడు తీవ్ర భావోద్వేగానికి లోనైయ్యారు. మంగ‌ళ‌వారం స‌భ‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. స‌భ‌లో అలాంటి ప‌రిస్థితులు నెల‌కొన‌డం దుర‌దృష్ట‌క‌ర‌మంటూ కంట‌త‌డి పెట్టుకున్నారు. బుధ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు రాజ్య‌స‌భ ప్రారంభం కాగానే వెంక‌య్య ప్ర‌సంగిస్తూ.. ప్ర‌జాస్వామ్యానికి పార్ల‌మెంట్ ఒక ప‌విత్ర దేవాల‌యం లాంటిద‌ని అన్నారు. అయితే.. కొంద‌రు స‌భ్యులు స‌భ‌లో అమ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించార‌న్నారు.

స‌భ‌లో టేబుళ్ల‌పై నిల్చున్నారు. పోడియం ఎక్కి నిర‌స‌న తెల‌ప‌డం అంటే.. గ‌ర్భ‌గుడిలో నిర‌స‌న తెలిపిన‌ట్లేన‌న్నారు. స‌భ ప‌విత్ర‌త‌ను కాపాడ‌టంలో అంద‌రూ విఫ‌ల‌మ‌య్యారని పేర్కొన్నారు. ఈ ప‌రిణాలు త‌లుచుకుంటే నిన్న రాత్రి నిద్ర‌ప‌ట్ట‌లేద‌న్నారు. మంగ‌ళ‌వారం స‌భ‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌ను పూర్తిగా ప్రజలకు చూపించాలని పేర్కొన్నారు. సభలో ఇన్ని రోజులు కార్యకలాపాలు స్తంభించడం మంచిది కాదంటూ వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

కాగా.. రాజ్యసభలో మంగళవారం విపక్ష సభ్యులు రైతుల సమస్యను లేవనెత్తాయి. ఈ అంశంపై చర్చ జరుగుతుండగా కొందరు సభ్యులు నల్లని వస్త్రాలు ఊపుతూ.. పత్రాలు విసిరేస్తూ తమ నిరసనలు తెలిపారు. ఒక ద‌శ‌లో చాలా మంది ఎంపీలు స‌భాప‌తి స్థానానికి దిగువ‌న పార్ల‌మెంట‌రీ సిబ్బంది కూర్చొనే చోట టేబుళ్ల‌పైకి ఎక్కి నిల్చున్నారు. ఇంకొంద‌రు ప్ర‌భుత్వ వ్య‌తిరేక నినాదాలు ఇచ్చారు. దీంతో ప‌లు మార్లు స‌భ వాయిదా ప‌డింది.

Next Story