వందేభారత్ పేరు మార్పు.. కొత్తగా ఏం పెట్టారంటే..
కేంద్ర ప్రభుత్వం వందేభారత్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 16 Sept 2024 3:55 PM IST
కేంద్ర ప్రభుత్వం వందేభారత్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా చాలా మార్గాల్లో వందే భారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఇక వందేభారత్‌లో స్లీపర్ కోచ్ లను కూడా తీసుకొస్తున్నారు. తాజాగా వందేభారత్ మెట్రో సర్వీస్ పేరును మార్చింది రైల్వే శాఖ ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. వందేభారత్ పేరును "నమో భారత్ ర్యాపిడ్ రైల్"గా మారుస్తూ భారతీయ రైల్వే అధికారిక ప్రకటన జారీ చేసింది. గుజరాత్‌లోని భుజ్-అహ్మదాబాద్ వందే మెట్రో ప్రారంభోత్సవానికి కొన్ని గంటల ముందే పేరు మార్పు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లో సాయంత్రం 4.15 గంటలకు భుజ్ రైల్వే స్టేషన్ నుంచి వందేభారత్ మెట్రో సేవలను ప్రారంభిస్తారని అధికారులు చెప్పారు.
నమో భారత్ ర్యాపిడ్ రైలు ప్రాంతీయ కనెక్టివిటీపై దృష్టి సారిస్తుందని.. సంప్రదాయ రైళ్లకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని అన్నారు. ఈ రైలు అందుబాటులోకి వచ్చాక రద్దీగా ఉండే మార్గాల్లో ట్రాఫిక్ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.నమో భారత్ ర్యాపిడ్ రైల్ ప్రాజెక్టును నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ కింద అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే.
నమో భారత్ ర్యాపిడ్ రైల్లో ప్రత్యేకతలు
* ఈ రైలులో 1,150 మంది ప్రయాణికులు కూర్చునే విధంగా 12 కోచ్‌లు ఉంటాయి
* భుజ్ నుంచి అహ్మదాబాద్ కు 359 కి.మీ దూరాన్ని 5 గంటల 45 నిమిషాల్లో చేరుకుంటుంది
* అహ్మదాబాద్ నుంచి సెప్టెంబర్ 17 న రెగ్యులర్ సర్వీస్ ప్రారంభమవుతుంది
* మొత్తం ప్రయాణానికి రూ.455 ఖర్చు అవుతుంది
* నమో భారత్ రైళ్లు అహ్మదాబాద్‌తోపాటు పలు ప్రధాన నగరాల మధ్య కనెక్టివిటీ పెంచుతాయి