ఇక కాషాయ రంగులో కనిపించనున్న వందేభారత్ రైలు

వందేభారత్‌ రైళ్ల రంగును మారుస్తోంది కేంద్రం. ఇక నుంచి కాషాయ రంగులో రైళ్లు కనిపించనున్నాయి.

By Srikanth Gundamalla  Published on  9 July 2023 5:59 AM GMT
Vande Bharat, Train, BJP, Flag Colour,

 ఇక కాషాయ రంగులో కనిపించనున్న వందేభారత్ రైలు

వందేభారత్‌ రైళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. హైస్పీడ్‌తో తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు ప్రయాణికులను చేర్చడమే వందేభారత్‌ రైళ్ల లక్ష్యం. అయితే.. ఇప్పటి వరకు వందేభారత్‌ రైళ్లు బ్లూ, వైట్‌ కలర్‌లో కనిపించాయి. కానీ ఇప్పుడు వాటి రంగును మారుస్తోంది కేంద్రం. ఇక నుంచి కాషాయ రంగులో రైళ్లు కనిపించనున్నాయి.

తెలుపు రంగులో ఉన్న రైళ్లను శుభ్రం చేయడంలో సమస్యలు ఎదురవుతున్నాయని రైల్వే శాఖ చెబుతోంది. ఈ క్రమంలోనే రైళ్లకు కాషాయ రంగుని అద్దినట్లు వివరిస్తోంది. డోర్లు నలుపురంగులో కనిపించనున్నాయి. ఇక మిగిలిన భాగం మొత్తం కాషాయ రంగు ఉండనుంది. అయితే.. వందేభారత్‌ రైళ్లకు కాషాయ రంగు వేయడంపై విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. బీజేపీ జెండాలో ఉండే కాషాయ రంగునే రైళ్లకు వేస్తున్నారని.. ఇది ఏమాత్రం సరికాదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

ఇక ఇటీవల భారత్‌ వేదికగా జీ20 సమావేశాలు జరిగాయి. జీ20 సదస్సు లోగో కూడా తమ పార్టీ జెండాలో ఉండే కలర్లతోనే రూపొందించారు. కమలం పువ్వు, కాషాయం, ఆకుపచ్చ రంగుల్లో లోగో కనిపించింది. దీంతో.. తమ పార్టీ జెండా రంగునే ప్రభుత్వ కార్యక్రమాలకు అద్దడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

వందేభారత్‌ రైళ్ల రంగు విషయంలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారు. జాతీయ జెండాను స్ఫూర్తిగా తీసుకునే ఈ రంగు వేస్తున్నట్లు తెలిపారు. వందేభారత్‌ రైళ్లకు కాషాయం రంగు మారిన ఫొటోలను అశ్వినీ వైష్ణవ్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఇప్పటి వరకు 25కి పైగా మార్పులు చేశామని చెప్పారు. వందేభారత్‌ రైళ్లలో ఇక కాషాయం రంగు ప్రముఖంగా కనిపంచనుంది. వందేభారత్‌ రైళ్లు తయారు చేస్తోన్న చైన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీని అశ్వినీ వైష్ణవ్ సందర్శించిన సందర్భంగా ఫొటోలను షేర్ చేశారు.

Next Story