ఉత్తరాఖండ్‌లో పేలిన ట్రాన్స్‌ఫార్మర్, 15 మంది మృతి

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాన్స్‌ఫార్మర్‌ పేలిపోయింది.

By Srikanth Gundamalla  Published on  19 July 2023 9:02 AM GMT
Uttarakhand, Transformer Blast, 15 Dead,

ఉత్తరాఖండ్‌లో పేలిన ట్రాన్స్‌ఫార్మర్, 15 మంది మృతి

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాన్స్‌ఫార్మర్‌ పేలిపోయింది. ఈ దుర్ఘటనలో విద్యుత్‌ షాక్‌కు గురయి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పోలీసు అధికారులు కూడా ఉన్నట్లు తెలిపారు. ఇంకా పలువురికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. చమోలీ జిల్లాలోని అలకనందా నదిపై ఉన్న ఓ వంతెన దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఉత్తరాఖండ్‌లో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. దాంతో వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలోనే అలకనంద నది కూడా ఉధృంగా ప్రవహిస్తోంది. నమామీ గంగా ప్రాజెక్టులో భాగంగా అలకనందా నదిపై ఉన్న వంతెనకు విద్యుత్‌ ప్రవాహం జరిగింది. దాంతో ఈ ప్రమాదం సంభవించింది. ట్రాన్స్‌ఫార్మర్‌ పేలిపోవడం వల్ల వంతెన రెయిలింగ్‌కు విద్యత్‌ ప్రవహించి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దాంతో ప్రమాద తీవ్రత పెరిగి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు పోలీసులు కూడా ఉన్నారు. ఒకరు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, మిగతా వారు హెంగార్డులు. మిగతా మృతులు సామాన్యులుగా పోలీసులు వివరించారు.

ప్రస్తుతం ట్రాన్స్‌ఫార్మర్ పేలిన సంఘటనపై దర్యాప్తు జరుగుతోందని ఉత్తరాఖండ్ ఏడీజీపీ వి. మురుగేశన్ వెల్లడించారు. రెయిలింగ్‌కు విద్యుత్‌ ప్రవాహించడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని.. ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని ఆయన తెలిపారు. కాగా.. ఈ దుర్ఘటనలో మరికొందరు గాయాలపాలు అయ్యారనీ.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నామని ప్రకటించారు. ఇక ఈ సంఘటనపై ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి విచారం వ్యక్తం చేశారు. తానే స్వయంగా ఘటనాస్థలిని పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.

గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్‌లో నిరంతరం వర్షాలు కురుస్తున్నాయని, గంగా సహా ఇతర నదులు ఉప్పొంగుతున్నాయి. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు మూసుకుపోయాయి. రుద్రప్రయాగ్‌లో వర్షం కారణంగా వచ్చిన వరదలో ఓ హోటల్ కొట్టుకుపోగా, కొంత మందికి గాయాలయ్యాయి. కొండ ప్రాంతాలలో డ్యామ్ నుండి నిరంతరం నీటిని విడుదల చేస్తున్నారు. హరిద్వార్, రిషికేశ్‌లలో కూడా నదుల నీటి మట్టం పెరిగింది.

Next Story