ఉత్తర్ ప్రదేశ్‌లో రైతు అలర్ట్‌తో తప్పిన రైలు ప్రమాదం
యూపీలో రైలు ప్రమాదాన్ని ఓ రైతు తప్పించాడు. రైలు పట్టాలు విరిగి ఉన్నట్లు గుర్తించి.. సకాలంలో స్పందించి ట్రైన్‌ను ఆపాడు.
By Srikanth Gundamalla Published on 5 Aug 2023 10:15 AM ISTఉత్తర్ ప్రదేశ్‌లో రైతు అలర్ట్‌తో తప్పిన రైలు ప్రమాదం
భారతీయ రైల్వేలో ఇటీవల కాలంలో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఒడిశాలో జరిగిన ప్రమాదంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. ఎన్నో కుటుంబాలు ఇప్పటికీ ఆ విషాద సంఘటన నుంచి బయటకు రాలేకపోతున్నాయి. ఆ తర్వాత కూడా వరుస ప్రమాదాలు జరిగాయి. ఈ క్రమంలో ఉత్తర్ ప్రదేశ్‌లో రైలు ప్రమాదాన్ని ఓ రైతు తప్పించాడు. రైలు పట్టాలు విరిగి ఉన్నట్లు గుర్తించి.. సకాలంలో స్పందించి ట్రైన్‌ను ఆపాడు.
ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ జిల్లాలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. భోలకాపురా గ్రామానికి చెందిన రైతు భన్వర్ సింగ్ ఎప్పటిలానే ఆగస్టు 4న ఉదయం పొలానికి బయల్దేరాడు. మార్గ మధ్యలో అతను రైలు పట్టాలను దాటాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే భన్వర్ సింగ్ ఒక చోట రైలు పట్టాలు విరిగిపోయి ఉండటాన్ని గమనించాడు. లాల్‌గోపాల్‌గంజ్‌కు దగ్గరే రైలు పట్టాలు పగిలిపోయింది. అయితే.. అప్పటికే ప్రయాగ్‌రాజ్ నుంచి బయల్దేరిన గోమతి ఎక్స్‌ప్రెస్ అదే ట్రాక్‌పై వస్తోంది. రైలుని గమనించిన రైతు ప్రమాదం జరగచ్చొనే అనుమానంతో అలర్ట్ అయ్యాడు. ఎలాగైనా ట్రైన్‌ను ఆపాలనుకున్నాడు. దాంతో.. అతని దగ్గరున్న ఎర్రటి వస్త్రాన్ని గాల్లో ఊపుతూ రైలు ఆపాలంటూ గట్టిగా కేకలు వేశాడు. అతడు ఎర్రటి వస్త్రాన్ని గాల్లో ఊపడాన్ని గమనించిన లోకోపైలట్ ట్రైన్‌ను ఆపేశాడు.
ఆ తర్వాత ఏం జరిగిందో అని లోకోపైలట్ ట్రైన్ దిగి చూశాడు. దగ్గరలో పట్టాలు విరిగిపోయి ఉండటాన్ని చూసి షాక్ అయ్యాడు. ఆ తర్వాత రైతును అభినందించాడు. పెను ప్రమాదం జరగకుండా నివారించావంటూ అతడికి కృతజ్ఞతలు తెలిపాడు. కాగా.. పట్టాలు విరిగిపోవడంతో ట్రైన్‌ను అక్కడే నిలిపివేశారు అధికారులు. దాంతో రాకపోకలకు కాసేపు అంతరాయం ఏర్పడింది. పట్టాలకు మరమ్మతులు చేసిన తర్వాత రైలు సర్వీసులను పునఃప్రారంభించారు అధికారులు. కాగా.. రైతు సమయస్ఫూర్తితో ట్రైన్ ఆపడాన్ని నెటిజన్లు సహా అధికారులు అభినందిస్తున్నారు.