ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఓ పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్ పాఠశాల బాలికతో పారిపోయాడన్న ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. బాలికను ప్రలోభపెట్టిన ఎస్సై.. ఆమెతో పరారయ్యాడు. పలియాలోని చౌకీ ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన జోగేంద్ర సింగ్ రెండు రోజుల క్రితం బాలికతో కలిసి పారిపోయాడు. సీనియర్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరైనందుకు జోగేంద్ర సింగ్ సస్పెండ్ చేయబడ్డాడు. కాగా ఈ విషయమై ఉన్నావ్ నివాసి అయిన బాలిక తండ్రి లక్నోలో సబ్ ఇన్‌స్పెక్టర్‌పై ఫిర్యాదు చేశారు.
తెలిసిన వివరాల ప్రకారం.. జోగేంద్ర సింగ్ ఆ అమ్మాయితో స్నేహం చేసాడు. బాలిక తరచుగా అతడితో కనిపించేది. లక్నోలోని తన గదిని ఖాళీ చేసి విద్యార్థిని వెళ్లిపోయిందని ఆమె స్నేహితులు చెబుతున్నారు. ఈ వ్యవహారం తెరపైకి రావడంతో పోలీసు శాఖలో కలకలం రేగింది. సబ్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు బాలిక కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. మెహందీపూర్ బాలాజీలో ఇన్‌స్పెక్టర్ లొకేషన్ కనుగొనబడింది. దీంతో పోలీసు బృందం అక్కడికి వెళ్లింది. తండ్రి చెప్పిన వివరాల ప్రకారం.. బాలిక డిసెంబర్9, 2022 న ఇంటికి వచ్చింది. ఆమె మళ్లీ డిసెంబర్ 12న లక్నో వెళ్లింది. అప్పటి నుండి ఆమె గురించి ఏమీ తెలియదు. ఇన్ స్పెక్టర్ జగేంద్ర సింగ్ ఆమెను తనతో ఎక్కడికో తీసుకెళ్లాడని లక్నోలోని బాలిక స్నేహితుల ద్వారా తండ్రికి తెలిసింది.