పరారీలోనే భోలే బాబా.. పోలీసుల ముమ్మర గాలింపు
ఉత్తర్ ప్రదేశ్‌లో ఇటీవల ఘోరం జరిగింది. భోలేబాబ కోసం వెళ్లిన భక్తులు మధ్య తొక్కిసలాట జరిగింది.
By Srikanth Gundamalla Published on 4 July 2024 11:35 AM ISTపరారీలోనే భోలే బాబా.. పోలీసుల ముమ్మర గాలింపు
ఉత్తర్ ప్రదేశ్‌లో ఇటీవల ఘోరం జరిగింది. భోలేబాబ కోసం వెళ్లిన భక్తులు మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఏకంగా 121 మంది ప్రాణాలు కోల్పోయారు. మరొకొందరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినా.. ఎలాంటి అరెస్ట్‌లు జరగలేదు. మరోవైపు ఈ విషాద సంఘటన తర్వాత భోలే బాబా పేరొందిన జగత్ గురు సాకార్ విశ్వహరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఎక్కడున్నాడనేది ఎవరికీ తెలియడం లేదు. దాంతో.. భోలే బాబా కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
మరోవైపు భోలే బాబా గురించి ఒక వదంతు బుధవారం వినిపించింది. మొయిన్‌పురిలోని నిరామ్ కుటీర్ చారిటబుల్ ఆశ్రమంలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దాంతో.. పోలీసులు అక్కడకు వెళ్లి సెర్చ ఆపరేషన్ నిర్వహించారు. కానీ.. అక్కడ ఆయన దొరకలేదు. ఆశ్రమంలో 40 నుంచి 50 మంది సేవాదార్‌లు అన్నారు. అక్కడున్నవారు కూడా భోలేబాబా ఆశ్రమానికి రాలేదని చెప్పారు. ఈ క్రమంలోనే మొయిన్ పురి డీఎస్పీ సునీల్ కుమార్ వివరాలను వెల్లడించారు. భోలేబాబా కోసం ముమ్మరగాలింపు చేస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు భోలే బాబా తరఫు న్యాయవాది సంచలన ప్రకటన విడుదల చేశారు. బాబా వేదిక పైనుంచి వెళ్లిపోయిన చాలా సమయం తర్వాతే ఈ ఘటన జరిగిందని చెప్పాడు. దీని వెనుక అసాంఘీక శక్తుల కుట్ర ఉందంటూ ఆరోపించారు. ప్రభుత్వం చేపట్టే దర్యాప్తునకు భోలే బాబా సహరిస్తారని ఆయన తరఫు న్యాయవాది చెప్పారు. ప్రమాద సమయంలో బాబా వేదిక వద్దే ఉన్నారని తెలుస్తోది. భక్తులను అతడి భద్రతా సిబ్బంది తోసేశారనీ.. అందువల్లే భక్తులు ఒకరి తర్వాత మరొకరు కిందపడి తొక్కిసలాట జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.