కారు నడుపుతూ హెల్మెట్ ధరించలేదని పోలీసుల జరిమానా
ఉత్తర్ ప్రదేశ్‌లో వింత సంఘటన వెలుగులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 26 Aug 2024 8:00 AM IST
కారు నడుపుతూ హెల్మెట్ ధరించలేదని పోలీసుల జరిమానా
ఉత్తర్ ప్రదేశ్‌లో వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. కారు నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ ధరించలేదని నోయిడా పోలీసులు జరిమానా విధించారు. తుషార్ సక్సేనా అనే వ్యక్తి కారు నడుపుతున్నాడు. అయితే.. గతేడాది అతనికి ఈ వింత అనుభవం ఎదురైంది. పొరపాటున ఈ మెసేజ్ వచ్చి ఉంటుందని లైట్ తీసుకున్నాడు. దాన్ని పట్టించుకోలేదు. అయితే.. ఇటీవల గతంలో ఉన్న వెయ్యి రూపాయల ఫైన్‌ను చెల్లించాలంటూ మెయిల్, మెసేజ్‌లు రావడం మొదలయ్యాయి. దాంతో.. మరోసారి సైట్‌లో వివరాలను చూసుకున్న తుషార్ షాక్ అయ్యాడు. హెల్మెంట్ ధరించకుండా కారు నడిపినందుకు ఫైన్ ఎలా విధిస్తారని ప్రశ్నించాడు. నేరుగా అతను పోలీసులను ఆశ్రయించాడు.
పోలీసులు కూడా హెల్మెట్ లేకుండా తన ఫోర్-వీలర్ వాహనాన్ని నడిపినందుకు జరిమానా విధించినట్లు చెప్పారు. జరిమానా చెల్లించకపోతే కోర్టుకు రావలసి ఉంటుందని పోలీసులు తనను హెచ్చరించారని తుషార్ సక్సేనా చెప్పాడు. ఈ మేరకు మాట్లాడిన తుషార్ సక్సేనా..'నవంబర్ 9, 2023న చలాన్ జారీ చేయబడింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే, జరిమానా విధించడం సాధారణమే. కానీ.. ఇది నిబంధనల్లో ఉందని అనుకోవడం లేదు. కారులో హెల్మెట్ ధరించాలనే నిబంధనపై వివరణ ఇవ్వాలని కోరాను. అధికారులు ఈ విషయాన్ని నాకు లిఖితపూర్వకంగా ఇవ్వాలి" అని సక్సేనా అన్నాడు. అయితే.. దీనిపై విచారణ జరిపి తన జరిమానాను రద్దు చేయాలని నోయిడా ట్రాఫిక్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.