కరోనా టీకా తీసుకున్నా.. యాంటీబాడీలు రాలేదంటూ పోలీసులకు ఫిర్యాదు

Uttar Pradesh Man claims no antibody even after jab.క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తూనే ఉంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Jun 2021 9:18 AM IST
కరోనా టీకా తీసుకున్నా.. యాంటీబాడీలు రాలేదంటూ పోలీసులకు ఫిర్యాదు

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తూనే ఉంది. వ్యాక్సినేష‌నే ఈ మ‌హ‌మ్మారి అడ్డుకోవ‌డానికి ఉన్న ఏకైక మార్గం అని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది వ్యాక్సిన్లు తీసుకుంటున్నా.. అతి త‌క్కువ మందిలో వ్యాక్సిన్ల స‌మ‌ర్థ‌త పై సందేహాలు ఉన్నాయి. కాగా.. క‌రోనా టీకా తీసుకున్న త‌రువాత కూడా త‌న శ‌రీరంలో యాంటీ బాడీలు త‌యారు కాలేదంటూ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్య‌క్తి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. టీకాల పేరిట తనను మోసం చేశారని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న త‌రువాత కూడా త‌న‌లో యాంటీబాడీలు రాలేదు సరిక‌దా.. ఉన్న ప్లేట్ లెట్స్ స‌గానికి పైగా ప‌డిపోయాయ‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఆషియానా ప్రాంతానికి చెందిన‌ ప్ర‌తాప్ చంద్ర అనే వ్య‌క్తి తెలిపాడు. తాను ఏప్రిల్ 8న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కొవిషీల్డ్ మొదటి మోతాదును తీసుకున్నాన‌ని.. అదే నెల 28న రెండో డోసు కోసం వెళ్లాన‌ని అయితే.. 6 వారాలు ఆగి ర‌మ్మాన్నార‌ని చెప్పాడు. ఆ త‌రువాత 12 వారాలు అయ్యాక వేస్తామ‌ని వెన‌క్కిపంపిచార‌న్నారు.

'తొలి డోసు తీసుకున్న త‌రువాత ప్ర‌భుత్వం ఆమోదించిన ల్యాబ్‌లో యాండీబాడీ జీటీ టెస్టు చేయించుకున్నా. అయితే.. టీకా వ‌ల్ల నా శ‌రీరంలో యాంటీబాడీలు వృద్ది చెంద‌లేద‌ని టెస్టుల్లో తేలింది. ప్లేట్‌లెట్ లెక్కింపు 3 లక్షల నుంచి 1.5 లక్షలకు తగ్గింది. కొవిషీల్డ్ తొలి డోసుతోనే యాంటీబాడీలు బాగా వృద్ది చెందుతాయ‌ని ఐసీఎంఆర్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ బ‌ల‌రామ్ భార్గ‌వ హామీకి నా పరిస్థితి పూర్తిగా విరుద్ధం అందుకే అందరిపైనా కేసు పెట్టాలని నిర్ణయించుకున్నా' అని ప్రదీప్ చంద్ర తన ఫిర్యాదులో రాసుకొచ్చాడు.

ప్ర‌స్తుతం ఎపిడమిక్ చట్టాలు అమలులో ఉన్నందున వ్యాక్సిన్ సమర్థతపై వచ్చిన ఫిర్యాదుపై కేసు పెట్టాలా.. వద్దా అని పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ నమోదు చేయని పోలీసులు.. ఉన్న‌తాధికారుల‌ను సంప్ర‌దించిన త‌ర్వాత దీనిపై తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు.

Next Story