జైలులో 63 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ పాజిటివ్
ఉత్తర్ ప్రదేశ్‌లోని లక్నో జిల్లా జైలులో కలకలం రేగింది.
By Srikanth Gundamalla Published on 5 Feb 2024 5:30 PM ISTజైలులో 63 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ పాజిటివ్
ఉత్తర్ ప్రదేశ్‌లోని లక్నో జిల్లా జైలులో కలకలం రేగింది. జైలులో వివిధ నేరాల్లో దోషులుగా నిరూపితమై శిక్ష అనుభవిస్తున్న 63 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ పాజిటివ్ అని తేలింది. డిసెంబర్‌లో ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అప్పుడు 36 మందికి హెచ్‌ఐవీ పాజిటివ్ అని తేలింది. అయితే.. తాజాగా ఆ సంఖ్య మరింత పెరిగింది. 36 మందిగా ఉన్న హెచ్‌ఐవీ బాధితులు ఇప్పుడు 63 మందికి పెరిగారు. ఒక్కసారిగా ఇలా హెచ్‌ఐవీ వైరస్ వ్యాప్తి చెందడం జైలులో కలకలం రేపుతోంది.
కాగా... ఈ వైరస్ ఇతర ఖైదీల నుంచి మరొకరికి ఎలా సోకిందనే విషయంలో మాత్రం స్పష్టత లేదని జైలు అధికారులు చెబుతున్నారు. అయితే.. ఖైదీల్లో చాలా మందికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని చెబుతున్నారు. వాటిని శరీరంలోకి ఎక్కించుకునే క్రమంలో ఒకరు ఉపయోగించిన సిరంజిని మరో ఖైదీ ఉపయోగించడం వల్ల హెచ్‌ఐవీ మిగతా వారికి వ్యాపించి ఉంటుందని జైలు అధికారులు అంచనా వేస్తున్నారు. వీరందరికీ ముందే హెచ్‌ఐవీ ఉందని, ఈ లక్నో జైలుకు వచ్చాక సంక్రమించలేదని కూడా చెబుతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో హెచ్‌ఐవీ పాజిటివ్ వచ్చిన వారిని జైలు అధికారులు లక్నోలోని ఓఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. వారి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు.
గత ఐదేళ్లలో లక్నో జైలులో ఇంత పెద్ద సంఖ్యలో ఖైదీలకు హెచ్‌ఐవీ కేసులు బయటపడటం ఇదే తొలిసారి. ఇక హెచ్‌ఐవీ ఎలా సంక్రమించింది అనే విషయాలపై ఆరా తీస్తున్నట్లు అధికారులు చెప్పారు. మరోవైపు మిగతా ఖైదీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ సంఖ్యలో హెచ్‌ఐవీ కేసులు నమోదు కావడంతో వారివారి ఆరోగ్యం, భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు స్పందించిన వైద్యారోగ్యశాఖ అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.