పండ్ల జ్యూస్‌లో యూరిన్‌ కలిపి విక్రయం.. ఇద్దరు అరెస్ట్

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.

By Srikanth Gundamalla  Published on  14 Sept 2024 3:30 PM IST
పండ్ల జ్యూస్‌లో యూరిన్‌ కలిపి విక్రయం.. ఇద్దరు అరెస్ట్

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి పండ్ల జ్యూస్‌లో మానవ మూత్రాన్ని కలిపి విక్రయించడం కలకలం రేపింది. అయితే.. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు అతన్ని చితకబాదారు. ఆ తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు షాపు యజమానితో పాటు.. అతని వద్ద పనిచేస్తున్న 15 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఘజియాబాద్‌లోని ఇందిరాపురిలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అమీర్ ఖాన్ అనే వ్యక్తి స్థానికంగా ఖుషీ జ్యూస్ పాయింట్‌ను నిర్వహిస్తున్నాడు. అతను గ‌త కొన్నిరోజులుగా విక్ర‌యిస్తున్న‌ జ్యూస్ రుచిలో తేడాగా ఉండటాన్ని గమనించారు. స్థానికులు విచారణ చేపట్టగా అతను జ్యూస్‌లో మానవమూత్రాన్ని కలిపి విక్రయిస్తున్నట్లు తేలింది. నిజమా కాదా తేల్చేందుకు నిఘా పెట్టారు. ఇక అతను మూత్రాన్ని జ్యూస్‌లో కలుపుతుండా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దాంతో.. అమీర్‌ఖాన్‌ను పట్టుకుని తీవ్రంగా దాడి చేశారు. దీని గురించి పోలీసులు సమాచారం తెలుసుకున్న తర్వాత వెంటనే అక్కడికి చేరుకున్నారు. అమీర్‌ఖాన్‌ను స్థానికుల నుంచి విడిపించి.. అరెస్ట్ చేశారు. అలాగే.. అదే జ్యూస్‌ పాయింట్‌లో పని చేస్తున్న మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఖుషీ జ్యూస్ కార్నర్‌లో మూత్రం డబ్బా దొరికిందని పోలీసులు తెలిపారు. ఆ డబ్బాలో ఉన్న యూరినేనా అని నిర్దారించేందుకు ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు.

ఈ మేరకు పోలీసులు ఇంకా మాట్లాడుతూ.. సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకుని అమీర్‌ఖాన్‌ను కాపాడామని చెప్పారు. అలాగే షాపులో నుంచి ఒక లీటరు యూరిన్‌ ఉన్న డబ్బాను స్వాధీనం చేసుకున్నామన్నారు. అయితే.. అమీర్‌ను విచారించినప్పుడు అతను సరైన సమాధానాలు చెప్పలేదన్నారు. దాంతో అరెస్ట్ చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.


Next Story