భోలే బాబా పాదాల వద్ద మట్టి కోసం భక్తుల తొక్కిసలాట, 116 మంది మృతి
ఉత్తర్ ప్రదేశ్‌లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 3 July 2024 2:01 AM GMTభోలే బాబా పాదాల వద్ద మట్టి కోసం భక్తుల తొక్కిసలాట, 116 మంది మృతి
ఉత్తర్ ప్రదేశ్‌లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. హథ్రస్ జిల్లా ఫుల్‌రయి గ్రామంలో భోలేబాబా పాద ధూళి కోసం వచ్చిన భక్తులు అదే మట్టిలో కలిసిపోయారు. బాబా కాళ్ల చుట్టూ ఉన్న మట్టిని తీసుకునేందుకు భక్తులు ఒకేసారి ప్రయత్నించారు. దాంతో.. తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ సంఘటనలో 116 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 108 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ సంఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సహా పార్లమెంట్ సభ్యులంతా సంతాపం తెలిపారు. ఈ విషాద సంఘటనపై విచారణకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
భోలేబాబా సత్సంగ్ స్థానికంగా పేరుగాంచిన బాబా. ఆయన సత్సంగ్ కార్యక్రమాన్ని గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్నారు. మంగళవారం చివరి రోజు కావడంతో ఆయనను దర్శించుకునేందుకు, ఆయన పాదాల చెంత మట్టిని సేకరించి తీసుకెళ్లేందుకు భారీగా భక్తులు వచ్చారు. ఈ సందర్భంగానే భక్తులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దాంతో ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట జరిగింది. 23 మృతదేహాలను ఎటా జిల్లా ఆస్పత్రికి తరలించారు. మిగిలిన మృతదేహాలు, గాయపడ్డవారిని కార్లు, అంబులెన్స్‌లు, ట్రక్కులు, టెంపుల్లో హథ్రస్‌లోని సికంద్రరావ్ ట్రామా కేర్ సెంటర్‌కు తీసుకెల్లారు. ఆస్పత్రి బయట మృతుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి.
ఈ సంఘటన సత్సంగ్‌ను ముగించుకుని సాయంత్రం 3.30 గంటల సమయంలో భక్తులు ఇంటికి వెళ్లే సమయంలోనే జరిగింది. జనమంతా ఒక్కసారిగా ఎగబడ్డారు. అందుకే ఈ మృతుల సంఖ్య పెరిగిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల తొక్కిసలాట జరిగిందని అధికారులు తెలిపారు. మైదానం చిత్తడిగా ఉండటంతో మరింత ప్రమాదకరంగా మారిందని సత్సంగ్‌లో పాల్గొన్న సోను కుమార్ తెలిపారు. సత్సంగ్ నిర్వాహకులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.