యూపీలో ఇళ్లలోకి వచ్చి తోడేళ్ల దాడులు..బాలిక మృతి, భయాందోళన
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో తోడేళ్లు భీభత్సం సృష్టిస్తున్నాయి. తోడేళ్ల దాడిలో రెండేళ్ల బాలిక మృతి చెందింది.
By Srikanth Gundamalla Published on 2 Sep 2024 5:45 AM GMTఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో తోడేళ్లు భీభత్సం సృష్టిస్తున్నాయి. తోడేళ్ల దాడిలో రెండేళ్ల బాలిక మృతి చెందింది. మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. అటవీ శాఖ అధికారులు గస్తీగా తిరుగుతున్నప్పటికీ తాజాగా దాడులు జరిగడం భయాందోళనకు గురి చేస్తోంది. మంగళవారం తెల్లవారుజామున 3.55 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. చనిపోయిన బాలికను అంజలిగా గుర్తించారు.
ఈ మేరకు బాలిక తల్లి మాట్లాడుతూ.. 'నా ఆరు నెలల పాప ఏడవడంతో నిద్ర లేచాను.. అప్పుడే నా కూతురిని తోడేలు తీసుకెళ్లిపోయింది. ఆమె రెండు చేతులూ కొరికింది. ఇంటి తలుపు తెరిచి ఉండటంతో చొరబడి పాపను ఎత్తుకెళ్లి చంపేశాయని ఆమె పేర్కొంది. మేం పేదవాళ్లం, కూలీ పనులు చేసుకునే వాళ్లమంటూ బాలిక తల్లి వాపోయింది. ఇక మరికొన్ని చోట్ల ఇలానే ఇళ్లలోకి చొరబడి ముగ్గురిపై దాడి చేశాయి తోడేళ్లు. వారికి గాయాలు కాగా.. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ మేరకు జిల్లా అధికారులు బహ్రైచ్ ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. తోడేళ్ల దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాత్రి వేళల్లో ప్రజలు ఎవరూ ఆరుబయట పడుకోవద్దని చెప్పారు. అలాగే.. కచ్చితంగా ఇంటి తలుపులు మూసుకోవాలని చెప్పారు. అయితే.. తాము ఇప్పటికే నాలుగు తోడేళ్లను పట్టుకున్నామని జిల్లా మెజిస్ట్రేట్ మోనికా రాణి చెప్పారు. తమ బృందాలు నిత్యం పెట్రోలింగ్ చేస్తున్నాయని అన్నారు. 'ఆపరేషన్ బేడియా' కొనసాగుతోందని చెప్పారు. మిగిలిన తోడేళ్లను కూడా త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. బహ్రైచ్‌లోని కనీసం 35 గ్రామాల్లో నెలన్నరలోనే తోడేళ్ల దాడిలో 8 మంది పిల్లలతో పాటు ఒక మహిళను చంపాయి.
ఈ వరుస సంఘటనలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పరిపాలన, పోలీసు, అటవీ శాఖ, స్థానిక పంచాయతీ, రెవెన్యూ శాఖలు ఈ ప్రాంతంలో విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలకు భద్రతా చర్యల గురించి కూడా చెప్పాలని, ప్రజాప్రతినిధుల సహకారం కూడా తీసుకోవాలన్నారు. సీనియర్ అధికారులు జిల్లాల్లో క్యాంపులు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశాల్లో పేర్కొన్నారు. విద్యుత్ సమస్య ఉన్న గ్రామాల్లో పెట్రోమ్యాక్స్ లైట్లు ఏర్పాటు చేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.