అతను ఒక స్వీపర్.. కానీ కోట్ల విలువైన ఆస్తులు, లగ్జరీ కార్లు
ఉత్తర్ ప్రదేశ్‌లో మొదట గోండా మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశాడు సంతోష్.
By Srikanth Gundamalla Published on 18 Aug 2024 11:15 AM ISTఅతను ఒక స్వీపర్.. కానీ కోట్ల విలువైన ఆస్తులు, లగ్జరీ కార్లు
దేశంలో ఎంతో మంది పేదవారు ఉన్నారు. అయితే.. నెలంతా కష్టపడుతూ చాలీచాలని జీతంతో జీవనం సాగిస్తున్నవారు ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. స్వీపర్‌గా పనిచేస్తూ ఓ వ్యక్తి సాధారణంగానే కనపడుతున్నాడు. కానీ.. అతని ఇంటికి వెళ్లి చూస్తే మాత్రం కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. అక్రమంగానే అంతా సంపాదించాడనే ఆరోపణలు ఉన్నాయి.
ఉత్తర్ ప్రదేశ్‌లోని గోండా జిల్లాకు చెందిన సంతోష్ జైస్వాల్.. మొదట గోండా మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశాడు. ఆ తర్వాత నిబంధనలకు విరుద్ధంగా డివిజనల్ కమిషనర్ కార్యాలయంలో స్వీపర్‌గా పదోన్నతి పొందాడు. ఈ క్రమంలోనే ఆఫీసులో ప్రభుత్వ ఫైళ్లను తారుమారు చేసి కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించాడు. ఫైళ్ల విషయం బయటపడటంతో కమిషనర్ విచారణకు ఆదేశించారు. సంతోష్ గుట్టు రట్టు కావడంతో అతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత పోలీసు కేసు కూడా నమోదు అయ్యింది.
ఇక విచారణలో భాగంగా సంతోష్ ఆస్తులను పరిశీలించిన అధికారులు షాక్ అయ్యారు. అతని వద్ద 9 లగ్జరీ కార్లు ఉన్నట్లు తెలిపారు. ఈ వాహనాలు సంతోష్ సోదరుడు, భార్య పేరుమీద ఉన్నట్లు అధికారులు నివేదికలో పేర్కొన్నారు. కాగా.. సంతోష్ చేసిన అక్రమాలపై ఇంకా విచారణకొనసాగుతోంది. అతని బ్యాంకు ఖాతా వివరాలను కూడా పరిశీలిస్తున్నట్లు అధికారులు చెప్పారు. నిందితుడిపై కఠిన చర్యలు ఉంటాయని అంటున్నారు.