ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై అమిత్ షా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది.

By Medi Samrat
Published on : 22 Aug 2025 6:14 PM IST

ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై అమిత్ షా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. మరోవైపు కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ బి. సుదర్శన్‌ రెడ్డి నక్సలిజానికి మద్దతిస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆరోపించారు. ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుద‌ర్శ‌న్ రెడ్డి నక్సలిజానికి సహకరించారని షా అన్నారు. ఆయన సల్వాజుడుంకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వకుంటే 2020కి ముందే దేశంలో వామపక్ష ఉద్యమం ముగిసి ఉండేదన్నారు.

శుక్రవారం కొచ్చిలో జరిగిన మీడియా గ్రూప్ కార్యక్రమంలో అమిత్ షా కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిని ఎంపిక చేసిన తీరుతో కేరళలో కాంగ్రెస్ విజయావకాశాలు మరింత తగ్గిపోయాయని అన్నారు. నక్సలిజం దెబ్బకు కేరళ తీవ్రంగా నష్టపోయిందని అమిత్ షా అన్నారు. వామపక్షాల ఒత్తిడికి తలొగ్గి కాంగ్రెస్ పార్టీ నక్సలిజానికి మద్దతిచ్చిన, సుప్రీంకోర్టు లాంటి పవిత్ర వేదికను ఉపయోగించుకున్న అభ్యర్థిని బరిలోకి దింపడం కేరళ ప్రజలు కచ్చితంగా చూస్తారన్నారు. హోంమంత్రి అమిత్ షా సల్వాజుడుంపై 2011 సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ.. ప్రతిపక్ష అభ్యర్థిని లక్ష్యంగా చేసుకున్నారు. సల్వాజుడుంపై తీర్పు ఇచ్చిన భావజాలంతో స్ఫూర్తి పొందిన వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అని అన్నారు.

Next Story