విపక్షాల కూటమి పేరు I-N-D-I-Aగా మార్పు.. ప్రకటించిన ఖర్గే

విపక్షాల కూటమికి I-N-D-I-A అనే పేరును నిర్ణయించారు.

By Srikanth Gundamalla  Published on  18 July 2023 5:22 PM IST
UPA, INDIA, Opposition Name Changed,

విపక్షాల కూటమి పేరు I-N-D-I-Aగా మార్పు..ప్రకటించిన ఖర్గే

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసమే విపక్ష పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే వ్యూహాలు రచిస్తున్నాయి. రెండ్రోజుల పాటు బెంగళూరులో 26 పార్టీలు సమావేశం అయ్యాయి. ఈ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు నాయకులు. పలు ప్రతిపక్ష పార్టీల నాయకుల డిమాండ్‌ మేరకు యూపీఏ కూటమి పేరును కూడా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. విపక్షాల కూటమికి I-N-D-I-A అనే పేరును నిర్ణయించారు. ఇకపై ‘భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి (I-N-D-I-A)’గా నామకరణం చేసినట్లు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే అధికారికంగా వెల్లడించారు.

రెండో జరిగిన విపక్షాల కూటమి సమావేశంలో పేరు మార్పుపై విస్తృతంగా చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే ఐదారు పేర్లను నాయకులు పరిశీలించారు. చివరకు దేశాన్ని ఏకం చేయాలని.. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనే లక్ష్యంగా ఉండేందుకు ప్రజల్లోకి మరింత వెళ్లేందుకు ఐఎన్‌డీఐఏగా నామకరణం చేశారు విపక్ష పార్టీల నాయకులు. కూటమి పేరులో ఫ్రంట్‌ అనే పదం ఉండకూడదని కూడా కొన్ని పార్టీలు సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో I-N-D-I-A భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి పేరికి అత్యధిక పార్టీ నేతలు ఏకీభవించారు. దాంతో ఇదే పేరుని ఖరారు చేశారు. ఈ పేరుని సమావేశంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీనే ప్రతిపాదించారని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఓడించడమే లక్ష్యంగా కంకణం కట్టుకున్న విపక్షాలు రెండో విడతగా బెంగళూరులో భేటీ అయ్యాయి. సోమవారం సాయంత్రం ఈ భేటీ ప్రారంభమవ్వగా.. మంగళవారం కీలక అంశాలపై నేతలు చర్చలు చేపట్టారు. ఇందులో ఒకటైన ‘కూటమి పేరు’పై విస్తృతంగా చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే ఐదారు పేర్లను నేతలు పరిశీలించారు.

ఇది బీజేపీ, ప్రతిపక్షాల మధ్య యుద్ధం కాదని అన్నారు మల్లికార్జున ఖర్గే. ప్రజల స్వాతంత్ర్యం, స్వేచ్ఛ కోసం చేస్తోన్న యుద్దమని చెప్పారు. తమ యాక్షన్‌ ప్లాన్‌ను తదుపరి జరగనున్న ముంబై సమావేశంలో వెల్లడిస్తామని మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ వర్సెస్‌ ఐఎన్‌డీఐఏగా పోరు ఉంటుందని చెబుతున్నారు విపక్ష పార్టీల్లోని నాయకులు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ ఓటమి ఖాయమని.. విపక్షాల కూటమిని ఢీకొట్టే సత్తా బీజేపీ కూటమికి లేదని అన్నారు పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ. విపక్ష నేతలపైకి సీబీఐ, ఈడీని ప్రయోగించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో ప్రతి వ్యవస్థను మోదీ ప్రభుత్వం నాశనం చేసిందని విపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు.

Next Story