స్మార్ట్‌ఫోన్ కొంటే బీరు ఉచితం.. ఎగబడిన జనం.. వ్యాపారి అరెస్ట్
స్మార్ట్‌ఫోన్ కొంటే బీర్ ఉచితం అంటూ ఓ వ్యాపారి ప్రకటించగా అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
By తోట వంశీ కుమార్ Published on 7 March 2023 10:37 AM ISTప్రతీకాత్మక చిత్రం
కస్టమర్లను ఆకట్టుకుని వ్యాపారాన్ని పెంచుకునేందుకు దుకాణదారులు ఆఫర్లను ప్రకటిస్తుంటారు. ఒకటి కొంటే మరొకటి ఉచితం, కొనుగోలుపై 10 నుంచి 50 శాతం తగ్గింపు వంటి చాలా ఆఫర్లను చూసిఉంటారు. అయితే.. స్మార్ట్‌ఫోన్ కొన్నవారికి రెండు బీర్ క్యాన్లను ఉచితంగా ఇస్తామని ఓ మొబైల్ షాపు యజమాని ప్రకటించాడు. ఇంకేముందు అతడు ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఆ షాపుకు క్యూ కట్టారు. ఇదే అతడి కొంపముంచింది. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది.
బదోహీలోని చౌరీ రోడ్‌లో రాజేష్ మౌర్య ఓ మొబైల్ షాపును నిర్వహిస్తున్నాడు. అమ్మకాలను పెంచుకునేందుకు అతడు ఉచిత బీర్ల పథకానికి తెర తీశాడు. మార్చి 3 నుంచి 7 వరకు తన షాపులో ఫోన్లు కొన్నవారికి రెండు బీర్ క్యాన్లను ఉచితంగా ఇస్తానని చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో పోస్టర్లు, కరపత్రాల రూపంలో భారీగా ప్రచారం చేశాడు.
ఇంకేముంది అతడు ఊహించిన దాని కంటూ అనూహ్య స్పందన వచ్చింది. భారీ సంఖ్యలో ప్రజలు అతడి షాపు వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసు సూపరింటెండెంట్ అనిల్ కుమార్ అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు షాపు వద్ద జనాన్ని చెదరగొట్టారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 151 (ప్రజా శాంతికి భంగం కలిగించడం) కింద మౌర్యను అరెస్టు చేశారు. అతని దుకాణాన్ని కూడా సీల్ చేశారు.