విషాదం.. కూలిన బంగాళదుంప కోల్డ్ స్టోరేజీ పై క‌ప్పు.. 8 మంది మృతి

బంగాళ‌దుంప కోల్డ్ స్టోరేజీ పై క‌ప్పు కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో 8 మంది మ‌ర‌ణించ‌గా మ‌రో 11 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 March 2023 11:47 AM IST
Cold storage building collapse, UP

కొన‌సాగుతున్న స‌హాయ‌క చ‌ర్య‌లు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. సంభాల్‌లోని చందౌసి ప్రాంతంలో గ‌ల బంగాళ‌దుంప కోల్డ్ స్టోరేజీ పై క‌ప్పు కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో 8 మంది మ‌ర‌ణించ‌గా మ‌రో 11 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

గురువారం ఉద‌యం 11.30 గంట‌ల స‌మ‌యంలో స్టోరేజీ పై క‌ప్పు కూలింది. దీంతో దాంట్లో ప‌ని చేస్తున్న వారు శిథిలాల కింద చిక్కుకున్నారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు అక్క‌డకు చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాయి.

ఈ ఘ‌ట‌న‌లో 8 మంది మృతి చెందిన‌ట్లు మొరాదాబాద్ డీఐజీ శలభ్ మాథుర్ తెలిపారు. "మొత్తం ఎనిమిది మంది మరణించారు. 11 మందిని రక్షించారు. మరికొంత మంది తప్పిపోయారు. ఈ కోల్డ్ స్టోరేజ్ భవనం బేస్ మెంట్ లో ఉంది. అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అని తెలిపారు.

శిథిలాలలో చిక్కుకున్న వారి కోసం అధికారులు స్నిఫర్ డాగ్‌లను ఉపయోగిస్తున్నారని సంభాల్ డీఎం మనీష్ బన్సాల్ తెలిపారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ స్నిఫర్ డాగ్‌ల సహాయంతో చిక్కుకున్న వ్యక్తుల కోసం వెతుకుతోంది. ఉదయానికి బలగాల సంఖ్య పెంచామని తెలిపారు.

21 గంటలకు పైగా శోధన కార్యకలాపాలు కొనసాగడంతో, చందౌసి పోలీసులు స్టోరేజీ యూనిట్ యజమానులపై కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను కనుగొనడానికి మాన్‌హాంట్ ప్రారంభించారు. విచారణ నిమిత్తం నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

జిల్లా మేజిస్ట్రేట్ ప్రకారం గాయపడిన కూలీలు మొరాదాబాద్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

సీఎం ఎక్స్ గ్రేషియా

ఈ ఘ‌ట‌నపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Next Story