దేశవ్యాప్తంగా సీఏఏ అమలుపై కేంద్రమంత్రి సంచలన కామెంట్స్
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను అమలు చేస్తామని కేంద్ర మంత్రి శాంతనూ ఠాకూర్ సంచలన కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 29 Jan 2024 1:47 PM ISTదేశవ్యాప్తంగా సీఏఏ అమలుపై కేంద్రమంత్రి సంచలన కామెంట్స్
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను అమలు చేస్తామని కేంద్ర మంత్రి శాంతనూ ఠాకూర్ సంచలన కామెంట్స్ చేశారు. పశ్చిమబెంగాల్ దక్షిణ 24 పరగణాల జిల్లా కాక్‌ద్వీప్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా రానున్న వారం రోజుల్లో సీఏఏ అమల్లోకి వస్తుందని.. దీనిపై తాను హామీ ఇస్తున్నట్లు కేంద్రమంత్రి శాంతనూ ఠాకూర్ చెప్పారు.
సీఏఏపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యలను శాంతనూ ఠాకూర్ గుర్తు చేశారు. సీఏఏను అమలు చేయకుండా దేశంలో ఉన్న ఎవరూ ఆపలేరని గతంలో అమిత్‌షా అన్నారని చెప్పారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తోన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై అమిత్‌షా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్రమ చొరబాట్లు, అవినీతి, రాజకీయ హింస, బుజ్జగింపు అంశాలను ఉద్దేశిస్తూ మమతా బెనర్జీపై అమిత్‌షా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బెంగాల్ నుంచి టీఎంసీ ప్రభుత్వాన్ని గద్దె దించి.. 2026లో బీజేపీని ప్రజలు ఎన్నుకోవాలని కేంద్ర మంత్రి శాంతనూ ఠాకూర్ కోరారు. 1971 తర్వాత వలస వచ్చినవారి జీవితాలు బాగుపడటానికి పౌరసత్వం ఉపయోగపడుతుందని అన్నారు. అందుకే సీఏఏను తీసుకొచ్చిందని పేర్కొన్నారు.
పార్లమెంట్ ఉభయ సభల్లో సీఏఏ బిల్లు 2019లో ఆమోదం పొందింది. ఇక ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపిన వెంటనే దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో నిరసనలు వ్యక్తం అయ్యాయి. సీఏఏకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేశాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్, అప్ఘానిస్థాన్ నుంచి 2014 డిసెంబర్ లోపు భారత్‌కు వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు క్రైస్తవులకు భారత పౌరసత్వం కల్పిస్తుంది. మన దేశంలో పౌరసత్వానికి మతాన్ని ఒక ప్రమాణంగా ఉపయోగించడం ఇదే మొదటి సారి. ముస్లింలకు పౌరసత్వం కల్పించడంపై ఎలాంటి నిబంధనలు పొందుపర్చలేదు. దాంతో.. ఈ చట్టం పలు విమర్శలకు దారి తీసింది.