తెలంగాణ రాష్ట్రంలోని రైతుల ఉజ్వల భవిష్యత్ కోసం ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తుండగా.. టీఆర్ఎస్ ప్రభుత్వం గందరగోళానికి గురిచేస్తోందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మంగళవారం రాష్ట్ర బీజేపీ నేతలతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత కొద్ది రోజులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నడుస్తున్న వివాదం పై ఆయన స్పందించారు. ధాన్యం కొనుగోళ్ల పై ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారన్నారు.
తాను ఢిల్లీలో లేని సమయంలో తెలంగాణ మంత్రులు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. గత రబీ సీజన్‌లో ధాన్యం సేకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. అదనంగా 20 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కొనేందుకు ఒప్పందం జరిగిందని.. ఈ అవకాశాన్ని ఒక్క తెలంగాణ రాష్ట్రానికే ఇచ్చినట్లు తెలిపారు.
ఒప్పందం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ధాన్యాన్ని ఇవ్వలేదన్నారు. నాలుగు సార్లు గడువును పొడిగించినట్లు చెప్పారు. ఇక ఒప్పందం ప్రకారం ధాన్యాన్ని సేకరించి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందన్నారు. ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ ప్రభుత్వం అబద్దాలు చెబుతోందన్నారు. రా రైస్ ఎంత ఇచ్చినా తీసుకుంటామని ఏడాది క్రితమే చెప్పామన్నారు. ఇప్పుడు కూడా రా రైస్ ఎంత ఇచ్చినా తీసుకునేందుకు సిద్దంగా ఉన్నామని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.