కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలోని దగాపూర్‌లో గురువారం ఓ కార్యక్రమానికి హాజరైన నితిన్ గడ్కరీ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. నేషనల్ హైవే - 10 వెంబడి ప్రతిపాదిత 13 కి.మీ నాలుగు-లేన్ ఎలివేటెడ్ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించే కార్యక్రమానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ అసౌకర్యానికి గురి కావడంతో సమీపంలోని ఆసుపత్రి బృందం సంఘటనా స్థలానికి చేరుకుని వారికి ప్రథమ చికిత్స అందించారు.
శరీరంలో షుగర్ లెవల్ తగ్గడంతో నితిన్ గడ్కరీ పరిస్థితి విషమంగా మారిందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం నితిన్ గడ్కరీ పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. సిలిగురిలో ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవానికి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. సిలిగురిలో రూ.1206 కోట్లతో చేపట్టిన 3 ఎన్‌హెచ్ ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం జరుగుతుండగా ఒక్కసారిగా పరిస్థితి విషమించింది. అనంతరం సుక్నా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బృందం అక్కడికి చేరుకుని వారికి చికిత్స అందించారు.
అనంతరం డార్జిలింగ్‌కు చెందిన బీజేపీ ఎంపీ రాజు బిస్తా నితిన్‌తో కలిసి కారులో తన ఇంటికి బయలుదేరారు. మతిగరలోని ఆయన స్వగృహంలో కేంద్రమంత్రికి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. వారి వెంట వైద్యులు కూడా ఉన్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురి కావడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు డిసెంబర్ 2018లో, మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆరోగ్యం క్షీణించింది. వేదికపైనే గడ్కరీ స్పృహతప్పి పడిపోయారు.దీంతో నితిన్ గడ్కరీని ఆస్పత్రికి తరలించారు.