తెలంగాణ ప్రభుత్వం కావాలనే కేంద్రంపై నిందలు వేస్తోందని కేంద్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇంత అన్యాయం చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరొకటి లేదని గోయల్ ఆరోపించారు. కేంద్రం పేదలకు సహకారం కోసం ఎంతో తాపత్రయం పడుతోందన్నారు. పేదలకు సాయంపై తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి చింతా లేదని గోయల్ విమర్శించారు. 80 కోట్ల మందికి 5 కిలోల చొప్పున అదనపు ధాన్యం అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఒక విఫల ప్రభుత్వమని గోయల్ మండిపడ్డారు.
తెలంగాణ సీఎం, మంత్రులు చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారని, సీఎం కేసీఆర్ అన్‌పార్లమెంటరీ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆక్షేపించారు. రాజకీయం అజెండాతోనే కేంద్రంపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిందలు మోపుతోందని గోయల్ ఆరోపించారు. ధాన్యం సేకరణపై ఎఫ్‌సీఐ తెలంగాణకు క్లియరెన్స్ ఇస్తుందని తెలిపారు. ఎఫ్‌సీఐ నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ధాన్యం సేకరణ అవకతవకలపై తెలంగాణకు ఆడిట్ బృందాలను పంపిస్తామన్నారు.