ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ పేరు మార్చాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కొత్త వివాదానికి తెర లేపారు. ముజఫర్‌నగర్ రైతుల రాజధాని అని, పేరు చెబితేనే దాని గర్వం దెబ్బతింటుందని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటిన తర్వాత మొఘలుల ఆనవాళ్లను చెరిపేసేందుకు జిల్లాకు కొత్త పేరు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ డిమాండ్‌పై భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) జిల్లా అధ్యక్షుడు యోగేష్ శర్మ స్పందిస్తూ.. ఈ ప్రకటన రాజకీయ స్టంట్ తప్ప మరొకటి కాదని అన్నారు.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయని, ప్రజలను ఏమార్చేందుకు ఇలాంటి అంశాలను లేవనెత్తారని ఆయన అన్నారు. రైతుల రాజకీయాలకు ముజఫర్‌నగర్ కేంద్రంగా మారిందన్నారు. 2013లో జరిగిన అల్లర్లతో జిల్లా అతలాకుతలమైంది, ఇది చాలా మంది ప్రాణాలను బలిగొంది. 50,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. అల్లర్లు ఆ ప్రాంతంలో సామాజిక, రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేశాయి. ఇవి 2014 ఎన్నికలలో భారీ మెజారిటీని పొందడంలో బిజెపికి సహాయపడ్డాయి.