రైతన్నలకు శుభవార్త.. పంటలకు కనీస మద్దతు ధరల పెంపు
Union Cabinet approves increase in MSP for kharif crops for 2021-22.కేంద్రప్రభుత్వం రైతులకు శుభవార్త
By తోట వంశీ కుమార్ Published on 10 Jun 2021 2:11 AM GMTకేంద్రప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో 2021-22 ఖరీఫ్ సీజన్‌కు 14 పంటలకు కనీస మద్దతు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. క్వింటా ధాన్యం(వరి) ధరను రూ.72 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దాంతో మద్దతు ధర రూ.1,868 నుంచి రూ.1,940కు పెరగనుంది. వరితో పాటు ఇతర ఖరీఫ్ పంటల రేట్లను కూడా ప్రభుత్వం పెంచింది. ఇందులో నువ్వులను గరిష్టంగా రూ.452 మేర, కనిష్ఠంగా సోయాబిన్(పసుపు పచ్చ) ధర రూ.70 మేర పెంచారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్న ఉద్దేశంతో అన్ని పంటలపై పెట్టిన పెట్టుబడికి 50శాతం అదనపు రాబడి వచ్చేలా ధరలు నిర్ణయించినట్లు కేంద్రప్రభుత్వం వెల్లడించింది.
క్వింటా కంది, మినుముల కనీస మద్దతు ధర ఒక్కొక్కటి రూ.300 మేర పెంచినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. వేరుశనగ రూ.275, కుసుమల ధరను రూ.235 పెంచినట్లు తెలిపారు. హైబ్రిడ్ జొన్న మద్దతు ధరను రూ.2620 నుంచి రూ.2738 రూపాయలకు పెంచారు. దేశీరకం జొన్నల ధర రూ.2640 నుంచి రూ.2,758కి పెంచారు. సజ్జలు క్వింటాల్‌కు గతేడాది రూ.2,150 ఉండగా దానిని ఇప్పుడు రూ.2,250కి పెంచారు. క్వింటాల్ రాగుల మద్దతు ధర రూ.3295 ఉండగా..దానిని రూ.3377కి పెంచారు. మొక్కజొన్న మద్దతు ధరను రూ.1850 నుంచి రూ.1870కి పెంచారు. పెసర్ల ధర రూ. 7196 నుంచి 7275కి పెంచారు. వేరుశనగల ధర గతంలో 5275 ఉండగా.. ఇఫ్పుడా ధర రూ.5550కి చేరింది. పొద్దుతిరుగుడు ధర రూ.5,885 ఉండగా.. 6015కి పెంచారు. ఇక సోయాబీన్ (పసుపు రంగు) ధరను రూ.3880 నుంచి 3950కి పెంచారు. పత్తి (సాధారణ రకం) మద్దతు ధరను రూ.5515 నుంచి రూ.5726కి పెంచారు. పత్తి (పొడవాటి రకం) ధర రూ. 5825 నుంచి రూ.6025కి పెంచారు.