మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో అరెస్టు అయిన కేంద్రమంత్రి నారాయణ్ రాణెకు బెయిల్ మంజూరు అయ్యింది. మంగళవారం అర్థరాత్రి తర్వాత రాయగఢ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాజకీయ ప్రేరేపిత ఆరోపణలతో పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్టు చేశారని కోర్టులో నారాయణ్ రాణె తరుపు న్యాయవాదులు వాదించారు. ఆయన ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ముంబై చేరుకున్న రాణెకు ఆయన మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు.
అసలేం జరిగిందంటే.. సోమవారం జరిగిన జన ఆశీర్వాద యాత్రలో భాగంగా నారాయణ్ రాణె రాయ్‌గఢ్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎంకు (ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశిస్తూ) స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లయిందో కూడా తెలియదని, అలాంటి వ్యక్తి చెంప పగలగొట్టాలని వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. మంత్రి రాణె చేసిన వ్యాఖ్యలపై శివసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఉదంతంపై నాసిక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రాణెపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. కేంద్ర మంత్రి నారాయణ్ రాణె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీ, శివసేన మధ్య మళ్లీ అంతర్గత యుద్ధం మొదలైంది.