ఉచితంగా ఆధార్ అప్‌డేట్.. ఎప్పటి వరకు అంటే?
ఆధార్ కార్డులో సమాచారం ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) తాజాగా మరోసారి పొడిగించింది.
By అంజి
ఉచితంగా ఆధార్ అప్‌డేట్.. ఎప్పటి వరకు అంటే?
ఆధార్ కార్డులో సమాచారం ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) తాజాగా మరోసారి పొడిగించింది. ఈ గడువు ఈ జూన్ 14వ తేదీతో ముగియాల్సి ఉండగా.. యూఐడీఏఐ మరోసారి ఏడాదిపాటు 2026 జూన్ 14 వరకు పొడిగించింది. ఈ నిర్ణయం వల్ల పెళ్లి, ఉద్యోగ బదిలీ, ఉన్నత విద్య లేదా ఇతర కారణాల వల్ల పేరు, చిరునామా, ఇతర సమాచారం మారితే వాటిని ఆధార్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు మరోసారి అవకాశం కలిగింది.
ఆధార్ అప్‌డేట్‌లో భాగంగా అవసరమైన డాక్యుమెంట్లను మనం యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. గతంలో ఆధార్ కేంద్రాల్లో ఈ వివరాలను అప్‌డేట్ చేయడానికి రూ.50 రుసుముగా చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు మనమే ఫ్రీగా ఆన్‌లైన్‌లో సంబంధిత డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి మన సమాచారాన్ని అప్‌డేట్ చేసుకోవచ్చు. దీని కోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
ఇలా అప్‌డేట్ చేయండి
- ఆన్‌లైన్‌లో ఆధార్‌లోని వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేయాలంటే ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ లేదా మై ఆధార్ పోర్టల్‌లో కూడా లాగిన్ అవ్వొచ్చు.
- అక్కడ కిందకు స్క్రోల్ చేస్తే డాక్యుమెంట్ అప్‌డేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే క్లిక్ టూ సబ్మిట్ అని కనిపిస్తుంది.
- దానిపై క్లిక్ చేస్తే లాగిన్ టూ ఆధార్ వయా ఓటీపీ అని వస్తుంది. అక్కడ మన ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి.
- అప్పుడు మన ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీతో లాగిన్ అయిన వెంటనే ఆధార్‌లో అప్పటికే ఉన్న మన వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
- అందులోని వివరాలన్నీ సరైనవో కాదో చెక్ చేసుకోండి. ఒకవేళ వీటిలో సవరణ ఉంటే చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత కనిపించే డ్రాప్ట్‌డౌన్ లిస్ట్ సాయంతో డాక్యుమెంట్లను ఎంచుకోవాలి. అప్‌డేట్ చేస్తున్న వివరాలకు సంబంధించిన సరైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. అక్కడ బాక్సులో సూచించిన సైజ్, ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి. తర్వాత నెక్స్ట్‌పై క్లిక్ చేయాలి.
- అప్పుడు 14 అంకెల (యూఆర్‌ఎన్) అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ వస్తుంది. దీని ద్వారా అప్‌డేట్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.