ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 22 Sep 2023 8:02 AM GMTఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ఇటీవల సనాతన ధర్మం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు స్టాలిన్. అయితే.. ఆయన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఓ స్వామిజీ అయితే ఏకంగా స్టాలిన్ తలను తీసుకొస్తే డబ్బులు ఇస్తానంటూ ప్రకటన కూడా చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా తన తనయుడి కామెంట్స్‌కు మద్దతు తెలిపారు. ఈ క్రమంలోనే ఈ అంశం మరింత ముదిరింది.
ఈ వ్యవహారం చివరకు సుప్రీంకోర్టు వరకు చేరింది. ఉదయనిధి స్టాలిన్‌తో పాటు.. తమిళనాడు ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. అంతేకాదు.. చర్యలు కోరుతూ 262 మంది ప్రముఖులు భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఇందులో మాజీ న్యాయమూరక్తులు, మాజీ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ పలు స్టేషన్లలో కేసులు కూడా నమోదు అయ్యిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ప్రధాని నరేంద్ర మోదీ కూడా సనాతన ధర్మం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినవారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వెనుక ఇండియా కూటమి ఉందంటూ విమర్శించారు.
ఇక సుప్రీంకోర్టులో ఈ వ్యవహారంపై పిటిషన్ దాఖలు కావడంతో.. సర్వోత్తర న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వంతో పాటు.. మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఎన్ని విమర్శలు.. బెదిరింపులు చేసినా వెనక్కి తగ్గని ఉదయనిధి స్టాలిన్.. సుప్రీంకోర్టు నోటీసులతో ఎలా స్పందిస్తారో అని ఉత్కంఠ నెలకొంది.