ఉదయనిధి వ్యాఖ్యలను సమర్ధించిన సీఎం స్టాలిన్
సనాత ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి కామెంట్స్‌పై విమర్శలు వెల్లివెత్తుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 4 Sept 2023 2:32 PM ISTఉదయనిధి వ్యాఖ్యలను సమర్ధించిన సీఎం స్టాలిన్
సనాత ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్స్‌పై విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఎక్కడ చేసిన ఉదయనిధి వ్యాఖ్యలపైనే చర్చ జరుగుతోంది. తమిళనాడుతో పాటు ఇతర ప్రాంతాల్లోని రాజకీయ నాయకులు ఆయన వ్యాఖ్యలను తప్పు బడుతున్నారు. సనాతన ధర్మాన్ని దోమల నిర్మూలన చర్యతో పోల్చడం పట్ల తమిళనాడులో హిందూ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఉదయనిధి గతంలో చర్చ్‌కి, ఆలయాలకు వెళ్లిన ఫోటోలను షేర్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కొందరు బీజేపీ నాయకులు అయితే.. ఉదయనిధి స్టాలిన్‌పై కేసు నమోదు చేయాలంటూ తమిళనాడు గవర్నర్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గవర్నర్‌కు ఉదయనిధి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడా అందించారు.
కాగా.. ఉదయనిధి వ్యాఖ్యలపై ఆయన తండ్రి, తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. తన కుమారుడు చేసిన వ్యాఖ్యలను సమర్ధించారు సీఎం స్టాలిన్. ఉదయనిధి చేసిన వ్యాఖ్యల్లో ఎక్కడా ఒక్క ముక్క కూడా తప్పు లేదని అన్నారు. దేశంలో నిరుద్యోగం, ద్రవోల్బణంపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనానికి అర్థం ఏంటని సీఎం స్టాలిన్ ప్రశ్నించారు. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధాని మోదీ ఎందుకు స్పందించడం లేదంటూ నిలదీశారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని అన్నారు సీఎం స్టాలిన్. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే.. బీజేపీ మతాన్ని ఆయుధంగా వాడుతోందని విమర్శలు చేశారు. ప్రజలను రెచ్చగొట్టి, ఆ మంటల వెచ్చదనంలో చలికాచుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ అల్లర్లు, మణిపూర్ హింసాత్మక ఆందోళనలు, హర్యానాలో గొడవలను ప్రస్తావించారు. బీజేపీ ఇకనైనా ఇలాంటివి మానుకోవాలని.. లేదంటే దేశంలోని ప్రజలను ఎవరూ రక్షించలేరని తమిళనాడు సీఎం స్టాలిన్ హెచ్చరించారు.