ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్
Uddhav Thackeray faction of Shiv Sena moves SC against EC decision. న్యూఢిల్లీ: ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని వర్గాన్ని నిజమైన శివసేనగా గుర్తిస్తూ..
By అంజి Published on 20 Feb 2023 1:17 PM ISTన్యూఢిల్లీ: ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని వర్గాన్ని నిజమైన శివసేనగా గుర్తిస్తూ.. ఆ వర్గానికి ''విల్లు, బాణం'' ఎన్నికల గుర్తును ఎన్నికల సంఘం కేటాయించడాన్ని సవాలు చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే వర్గం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం పిటిషన్‌ను ముందస్తుగా జాబితా చేయాలని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. అయితే సీజేఐ ఎలాంటి ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించారు.
''నియమం ఎడమ, కుడి లేదా మధ్య అనే తేడా లేకుండా అందరికీ సమానంగా వర్తిస్తుంది. సరైన ప్రక్రియ ద్వారా రేపు రండి'' అని ధర్మాసనం పేర్కొంది. ఎన్నికల సంఘం శుక్రవారం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని వర్గాన్ని నిజమైన శివసేనగా గుర్తించి దానికి "విల్లు, బాణం" ఎన్నికల గుర్తును కేటాయించాలని ఆదేశించింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఉప ఎన్నికలు పూర్తయ్యే వరకు ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి కేటాయించిన "మంటలు మండుతున్న టార్చ్" పోల్ గుర్తును ఉంచుకోవడానికి కమిషన్ అనుమతించింది.
2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 55 మంది శివసేన అభ్యర్థులకు అనుకూలంగా పోలైన ఓట్లలో దాదాపు 76 శాతం ఓట్లు షిండేకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలకు వచ్చాయని కమిషన్ పేర్కొంది. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు గెలిచిన శివసేన అభ్యర్థులకు అనుకూలంగా పోలైన ఓట్లలో 23.5 శాతం వచ్చాయని ముగ్గురు సభ్యుల కమిషన్ తెలిపింది. అయితే ఇప్పుడు, ఉద్ధవ్ వర్గం తన భవిష్యత్తును నిర్ణయించే ఉన్నత న్యాయస్థానం నుండి ఆశలు పెట్టుకుంది.
ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం సోమవారం ముంబైలోని పార్టీ కార్యాలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఠాక్రే వారితో సమావేశం అయ్యారు. మరోవైపు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే మంగళవారం తన వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. షిండే సమావేశంలో ఉద్ధవ్ వర్గం నేతలు ప్రియాంక చతుర్వేది, సంజయ్ రౌత్ రాజ్యసభ సభ్యత్వంపై చర్చ జరగనుంది.