భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన మిగ్–21 యుద్ధ విమానం రాజస్థాన్ రాష్ట్రంలోని బర్మార్ జిల్లాలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు ఫైలట్లు మరణించారు.
రాజస్థాన్‌లోని ఉత్తర్‌లాయ్ ఎయిర్ బేస్ నుంచి ఈ విమానం బయలుదేరింది. భీమ్డా గ్రామం వద్ద గురువారం రాత్రి 9.10 గంటల సమయంలో కూలిపోయింది. విమానం కూలిన వెంటనే భారీ ఎత్తున మంటలు ఎగిసిడిపడ్డాయి. రెండు సీట్లున్న ఈ విమాన ప్రమాదంలో ఇద్దరు ఫైలట్లు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకనే వెంటనే అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. విమాన శిథిలాలు ఒక కిలోమీటరు వరకు చెల్లా చెదురుగా పడిపోయినట్లు గుర్తించారు.
ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరితో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించినట్టు వాయుసేన తెలిపింది.