వకీల్ సాబ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు మంచి కలెక్షన్లు లభిస్తూ ఉన్నాయి. హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వకీల్ సాబ్ సినిమా టికెట్లు, బెనిఫిట్ షోల గురించిన చర్చ జరుగుతూ ఉంది. టికెట్ల రేట్లను పెంచితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతూ ఉంది. ఇక వకీల్ సాబ్ సినిమాను ప్రదర్శిస్తున్న రెండు సినిమా హాళ్లను అధికారులు సీజ్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకోలేదు.
ఇది పక్కనే ఉన్న ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది. వకీల్ సాబ్ సినిమాకు ఒడిశాలోనూ మంచి ఆదరణ లభిస్తోంది. ఆ సినిమాను చూడడానికి అభిమానులు థియేటర్లకు భారీ సంఖ్యలో వెళుతున్నారు. హౌస్ ఫుల్ బోర్డులు కూడా పెట్టేశారు. ఈ నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు పాటించడం లేదంటూ ఈ సినిమాను ప్రదర్శిస్తున్న గజపతి జిల్లా పర్లాఖెముండిలోని రెండు థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. పట్టణంలోని రెండు థియేటర్లలో సినిమా విడుదల కాగా, సినిమాను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. దీంతో థియేటర్ల వద్ద భారీ రద్దీ ఎర్పడుతోంది. ఆదివారం కావడంతో అభిమానుల తాకిడి మరింత ఎక్కువైంది. ఈ క్రమంలో కొవిడ్ నిబంధనలు అసలు అమలవ్వలేదు.. దీంతో అధికారులు కరోనా నిబంధనలను ఉల్లంఘించారంటూ రెండు సినిమా థియేటర్లను తాత్కాలికంగా సీజ్ చేశారు. దీంతో సినిమాకు వెళ్లాలని అనుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు నిరాశ ఎదురైంది.