జమ్మూకశ్మీరులోని షోపియాన్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున భద్రతా బలగాలకు, ఉగ్రావాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో లష్కరే తొయిబా కమాండర్ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్ ప్రాంతంలోని సాథిక్ ఖాన్ ఏరియాలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర సోమవారం తెల్లవారుజామున కేంద్ర భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలకు పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు.
ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా గాలింపు చేపట్టారని, ఈ క్రమంలో గాలింపు బృందాలపై ముష్కరులు కాల్పులు జరిపారని, ప్రతిగా భద్రతా బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తొయిబా కమాండర్ ఇష్ఫక్ దార్ అలియాస్ అబూ అక్రమ్‌తోపాటు మరో ఉగ్రవాది చనిపోయాడని తెలిపారు. 2017 నుంచి అబు అక్రమ్ కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడన్నారు.
ఉగ్రవాదుల మృతదేహాల వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు ఇంకా కొనసాగుతున్నదని చెప్పారు. ఇదిలా ఉంటే.. శ్రీనగర్ లో శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు మరణించిన సంగతి తెలిసిందే.