జమ్ము-కశ్మీరులోని పుల్వామాలో మళ్లీ కాల్పులు మోత చోటుచేసుకుంది. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. బుధవారం తెల్లవారుజామున పుల్వామా జిల్లాలోని కస్బా యార్ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఓ ఇంట్లో ముష్కరులు నక్కి ఉన్నారన్న సమాచారం అందడంతో భద్రతా బలగాలు వెంటనే అక్కడికి చేరుకున్నారు. భద్రతాబలగాల రాకను గమనించిన ఉగ్రవాదులు వారిపై కాల్పులకు పాల్పడ్డారు.
ప్రతిగా భద్రతా దళాలు కూడా కాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిద్దరు జైషే మహమ్మద్ గ్రూప్‌నకు చెందిన వారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఒకరు జైషే మహమ్మద్ (జేఈఎం) కమాండ్ యాసిన్ పర్రే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇతను ఐఈడీ బాంబుల తయారీలో స్పెషలిస్టు అని చెప్పారు. మరో ఉగ్రవాదిని ఫుర్ఖాన్‌గా గుర్తించారు.