కృష్ణాష్ట‌మి వేడుక‌ల్లో విషాదం.. తొక్కిస‌లాట‌లో ఇద్ద‌రు భ‌క్తుల మృతి

Two devotees killed in stampede at Mathura Janmashtami celebrations.కృష్ణాష్ట‌మి రోజున తీవ్ర విషాదం నెల‌కొంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Aug 2022 1:18 PM IST
కృష్ణాష్ట‌మి వేడుక‌ల్లో విషాదం.. తొక్కిస‌లాట‌లో ఇద్ద‌రు భ‌క్తుల మృతి

ఉత్త‌ర‌ప్రదేశ్‌లోని మథురలో కృష్ణాష్ట‌మి రోజున తీవ్ర విషాదం నెల‌కొంది. తొక్కిస‌లాట కార‌ణంగా ఇద్ద‌రు భ‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఆరుగురు గాయ‌ప‌డ్డారు. మ‌థుర‌లోని బంకే బిహ‌రీ ఆల‌యం వ‌ద్ద శుక్ర‌వారం అర్థ‌రాత్రి త‌రువాత ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

బంకే బిహరీ ఆలయం వ‌ద్ద శుక్రవారం అర్ధరాత్రి జన్మాష్టమి వేడుకలను ఘ‌నంగా నిర్వ‌హించారు. అయితే.. భ‌క్తుల ర‌ద్దీ ఒక్క‌సారిగా పెరిగిపోయింది. హార‌తి ఇస్తున్న స‌మ‌యంలో భ‌క్తులు ఎగ‌బ‌డ‌డంతో తొక్కిస‌లాట‌కు దారి తీసింద‌ని పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌నలో ఓ మ‌హిళ‌, పురుషుడు ఊపిరి అంద‌క చ‌నిపోయిన‌ట్లు చెప్పారు.

ఈ ఘ‌ట‌న‌పై మథుర సీనియర్ పోలీస్ అధికారి అభిషేక్ యాదవ్ మాట్లాడుతూ.. "బంకే బిహరీ ఆలయం వద్ద జరిగిన జన్మాష్టమి వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో వ‌చ్చారు. హారతి ఇస్తున్న సమయంలో రద్దీ పెరిగిపోయి పరిస్థితి అదుపుతప్పింది. తొక్కిసలాట చోటుచేసుకుంది. ఓ మహిళ, ఓ పురుషుడు ఊపిరాడక మ‌ర‌ణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. వారికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోందని" అన్నారు.

అంతకు ముందు.. ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ మథురలోని కృష్ణ జన్మభూమి ఆలయాన్ని సందర్శించారు. 'పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం' అన్న శ్రీ కృష్ణ భగవానుడి బోధనలు మన ఆలోచనలు, మన చర్యలు, మన దృష్టిని ప్రేరేపిస్తాయని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

కాగా.. పురాణాల ప్రకారం మథురను శ్రీకృష్ణుడి జన్మస్థలంగా పేర్కొంటారు. కృష్ణుడు అర్థ‌రాత్రి అవ‌రించాడు. అందుక‌నే మ‌థురలో జ‌న్మాష్ట‌మి రోజున అర్థ‌రాత్రి ప్ర‌త్యేక ప్ర‌సాదాన్ని పంచిపెడుతారు.

Next Story