జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ బృందంలో కొత్త డిప్యూటీ ఎన్‌ఎస్‌ఏలుగా టీవీ రవిచంద్రన్, పవన్ కపూర్‌లను జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ నియమించారు. అదేవిధంగా డిప్యూటీ ఎన్‌ఎస్‌ఏగా పనిచేసిన రాజేంద్ర ఖన్నా అదనపు ఎన్‌ఎస్‌ఏగా నియమితులయ్యారు. టీవీ రవిచంద్రన్ 1990 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ బ్యూరోలో ప్రత్యేక డైరెక్టర్‌గా ఉన్నారు. పవన్ కపూర్ 1990 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి. భారతదేశం కోసం విదేశాలలో అనేక మిషన్లలో పనిచేశారు. ఆయన విదేశాంగ మంత్రిత్వ శాఖ, ప్రధాన మంత్రి కార్యాలయంలో పనిచేశారు. అతను లండన్‌లోని కామన్వెల్త్ సెక్రటేరియట్‌లో అంతర్జాతీయ సివిల్ సర్వెంట్‌గా కూడా పనిచేశాడు.
ఇటీవల, డిప్యూటీ ఎన్‌ఎస్‌ఏ విక్రమ్ మిస్రీ విదేశాంగ కార్యదర్శిగా నియమితులయ్యారు. 1968 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన దోవల్ ను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి ఎన్‌ఎస్‌ఏగా నియమించడం గమనార్హం. ఆయనకు కేబినెట్ మంత్రి హోదాను కేటాయించారు. జనవరి 20, 1945న ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్‌లో జన్మించిన దోవల్, 1968లో ఐపీఎస్‌లో చేరి, తన విశిష్ట సేవలకు గానూ 1988లో కీర్తి చక్ర అందుకున్నారు. భారత పోలీస్ మెడల్ అందుకున్న అతి పిన్న వయస్కుడైన అధికారి దోవల్ కావడం గమనార్హం.