త్రిపుర సీఎం విప్లవ్ దేవ్‌పై హత్యాయత్నం జరిగింది. ఆయన్ను కారుతో ఢీ కొట్టేందుకు యత్నించగా.. ముఖ్యమంత్రి అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గురువారం సాయంత్రం ఈ ఘటన జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. అగర్తాలాలోని శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ లేన్‌లోని తన అధికారిక నివాసం వద్ద సీఎం విప్లవ్ కుమార్ ఈవినింగ్ వాక్ చేస్తుండగా.. గుర్తు తెలియని ముగ్గురు దుండగులు కారులో వచ్చి సీఎంను ఢీకొట్టేందుకు యత్నించారు. వాహనాన్ని గమనించిన సీఎం వెంటనే పక్కకు జంప్ చేశారు. ఈ ఘటనలో సీఎం సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరి స్వల్పగాయాలు అయ్యాయి. భద్రతా సిబ్బంది ఆ కారును పట్టుకునేందుకు యత్నించగా.. కారు వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది.
దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం అర్థరాత్రి ఆ ముగ్గురిని కీర్చోముహని ఏరియాలో అదుపులోకి తీసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. ఈ ముగ్గురిని శుక్రవారం రోజు కోర్టులో హాజరు పరిచారు. అనంతరం వారికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. కాగా.. సీఎంపై దాడికి ఎందుకు ప్రయత్నించారు అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.