75 ఏళ్ల తర్వాత ఎగిరిన త్రివర్ణ పతాకం
By - Nellutla Kavitha |
సరిగ్గా రెండు నెలల క్రితం గుంటూరు జిల్లా జిన్నా టవర్ దగ్గర వివాదాలు, రాజకీయ చర్చలు కేంద్ర కేంద్రీకృతమయ్యాయి. విభజనకు కారణమైన జిన్నా పేరును తొలగించి, అబ్దుల్ కలాం పేరు పెట్టాలని, జాతీయ జెండా ఎగురవేయాలని ఆందోళనలు నిర్వహించారు. అయితే అక్కడి ప్రజాప్రతినిధుల చొరవతో టవర్ కు జాతీయ జెండా రంగులు వేసి, జిన్నా టవర్ మీద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఇక ఇప్పుడు సరికొత్తగా మరొక టవర్ వార్తల్లోకి వచ్చింది.
కర్ణాటక రాష్ట్రం కోలార్ లో ఉన్న క్లాక్ టవర్ కి దశాబ్దాల చరిత్ర ఉంది. క్లాక్ టవర్ దాదాపుగా 75 ఏళ్లుగా ఆకుపచ్చరంగులో నే ఉంటుూ వచ్చింది. అప్పటినుంచి దీనిపై ఆకుపచ్చ జెండాలు ఎగురుతూనే ఉండేవి. దీంతో గత కొంతకాలంగా స్థానిక ఎంపీ మునిస్వామి తో పాటు మరికొంతమంది టవర్ రంగు మార్చాలని, క్లాక్ టవర్ మీద ఉన్న జెండాలు తీసేసి త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కోలార్ లో ఆందోళనలు జరగడంతో అక్కడ పోలీసులు 144 వ సెక్షన్ విధించాల్సి వచ్చింది. చివరకు స్వయంగా ఎస్పీ రంగంలోకి దిగి ఇరు వర్గాలతో చర్చలు జరిపి, వివాదం తలెత్తకుండాచూశారు. పోలీసుల భద్రత మధ్య టవర్ కు తెలుపు రంగు వేసి, క్లాక్ టవర్ మీద ఉన్న జెండాలను తొలగించారు. గత శనివారం మువ్వన్నెల పతాకాన్ని టవర్ పై ఎగురవేశారు.