రైలు పట్టాలపై ఎల్‌పీజీ సిలిండర్.. తప్పిన భారీ విధ్వంసం
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో ఆదివారం ట్రాక్‌పై ఉంచిన ఎల్‌పీజీ సిలిండర్‌ను ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదు.
By అంజి Published on 9 Sep 2024 4:56 AM GMTరైలు పట్టాలపై ఎల్‌పీజీ సిలిండర్.. తప్పిన భారీ విధ్వంసం
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో ఆదివారం ట్రాక్‌పై ఉంచిన ఎల్‌పీజీ సిలిండర్‌ను ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రయాగ్‌రాజ్ నుంచి హర్యానాలోని భివానీకి వెళ్తున్న కాళింది ఎక్స్‌ప్రెస్ కాన్పూర్‌లోని శివరాజ్‌పూర్ ప్రాంతంలోని అన్వర్‌గంజ్-కాస్‌గంజ్ రైలు సెక్షన్‌లో నడుస్తుండగా ఈ ఘటన జరిగింది.
లోకోమోటివ్ పైలట్ ట్రాక్‌పై ఎల్‌పిజి సిలిండర్, ఇతర అనుమానాస్పద వస్తువులను చూశాడు. ఆ తర్వాత అతను బ్రేక్‌లు వేశాడు. అయితే ఆ తర్వాత రైలు ఆగిపోయే ముందు సిలిండర్‌ను ఢీకొట్టింది. ఘటన తర్వాత కాన్పూర్ పోలీస్, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, సంఘటనా స్థలం నుండి LPG సిలిండర్‌తో పాటు పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్టెలను స్వాధీనం చేసుకున్నారు.
ఘటనా స్థలంలో సుమారు 20 నిమిషాల పాటు రైలు నిలిచిపోయిందని, విచారణ నిమిత్తం మళ్లీ కాన్పూర్‌లోని బిల్హౌర్ స్టేషన్‌లో నిలిపివేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై కాన్పూర్ అదనపు పోలీసు కమిషనర్ హరీశ్ చందర్ మాట్లాడుతూ.. ''ప్రయాగ్‌రాజ్ నుంచి భివానీకి వెళ్తున్న రైలు గ్యాస్ సిలిండర్‌ను ఢీకొట్టిందని రైల్వే అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. సీనియర్ అధికారులు, ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలంకు చేరుకుంది. పోలీసులు దెబ్బతిన్న సిలిండర్, ఇతర అనుమానాస్పద వస్తువులను స్వాధీనం చేసుకున్నారు, మేము ఈ సంఘటనపై విచారణ చేస్తున్నాము. ఆ తర్వాత నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాము'' అని చెప్పారు.
గత నెలలో, వారణాసి నుండి సబర్మతికి వెళ్లే సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 22 కోచ్‌లు కూడా కాన్పూర్‌లో పట్టాలు తప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన అనంతరం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, రైలు ఇంజిన్ పట్టాలపై ఉంచిన వస్తువును ఢీకొట్టిందని, భద్రతా ఏజెన్సీలను అప్రమత్తం చేశామని చెప్పారు.