మోసపూరిత బెదిరింపు ఫోన్ కాల్స్ గురించి ప్రజలను ట్రాయ్ అప్రమత్తం చేసింది. ట్రాయ్ నుంచి ప్రీ రికార్డ్ కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదులు రావడంతో టెలికాం రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా స్పందించింది. త్వరలో ఫోన్ నంబర్‌లు బ్లాక్ చేస్తారని బెదిరిస్తూ వ్యకిగత సమాచారాన్ని కోరడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. మొబైల్ వినియోగదారులకు తమ నుంచి ఎలాంటి కాల్స్ కానీ, మెసేజ్‌లు కానీ ఉండవని స్పష్టం చేసింది. మొబైల్ కనెక్షన్లు తొలగించడమో, రద్దు చేసే వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ట్రాయ్ చెప్పింది.
“వ్యకిగత సమాచారం కోసం కస్టమర్‌లను సంప్రదించడానికి ట్రాయ్ ఏ థర్డ్-పార్టీ ఏజెన్సీకి అధికారం ఇవ్వలేదు. అందువల్ల ట్రాయ్ నుండి వచ్చినట్లు చెప్పుకునే ఏ విధమైన కమ్యూనికేషన్ (కాల్, సందేశం లేదా నోటీసు), మొబైల్ నంబర్ డిస్‌కనెక్ట్ చేయబడుతుందని చెప్పడం మోసపూరిత ప్రయత్నంగా పరిగణించాలి ”అని టెలికాం రెగ్యులేటర్ హెచ్చరించింది. ట్రాయ్ పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత మోసగాళ్ల బారిన పడకుండా భయాందోళనలకు గురికావద్దని సూచించింది.