జార్ఖండ్‌లో కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్: ఏడుగురు దుర్మరణం!

జార్ఖండ్‌లోని రాంచీ నుంచి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా జరిగిన విమాన ప్రమాదంలో విషాదం చోటుచేసుకుంది.

By -  అంజి
Published on : 24 Feb 2026 7:23 AM IST

Air Ambulance Crash Jharkhand, Chatra Plane Crash, Redbird Airways Beechcraft C90, Medical Evacuation Tragedy, Ranchi to Delhi Flight Crash, AAIB Investigation, Pilot Vivek Vikas Bhagat

జార్ఖండ్‌లో కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్: ఏడుగురు దుర్మరణం!

జార్ఖండ్‌లోని రాంచీ నుంచి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా జరిగిన విమాన ప్రమాదంలో విషాదం చోటుచేసుకుంది. జార్ఖండ్‌లోని చత్రా జిల్లాలో సోమవారం రాత్రి ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలిన ఘటనలో విమానంలో ఉన్న ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన బీచ్‌క్రాఫ్ట్ C90 (VT-AJV) విమానం సోమవారం రాత్రి 7:11 గంటలకు రాంచీ నుంచి బయలుదేరింది. రాత్రి 10 గంటలకు ఢిల్లీ చేరుకోవాల్సి ఉండగా, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే (రాత్రి 7:34 గంటలకు) కోల్‌కతా ఏయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి.

వారణాసికి ఆగ్నేయంగా 100 నాటికల్ మైళ్ల దూరంలో రాడార్ నుంచి విమానం అదృశ్యమైంది. చివరకు చత్రా జిల్లాలోని సిమారియా సమీపంలో విమానం కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు. పైలట్లు కెప్టెన్ వివేక్ వికాస్ భగత్ (పైలట్-ఇన్-కమాండ్), కెప్టెన్ సవరాజ్ దీప్ సింగ్ (కో-పైలట్), రోగి సంజయ్ కుమార్ (41), వైద్య బృందం డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా, పారామెడిక్ సచిన్ కుమార్ మిశ్రా, సహాయకులు అర్చన దేవి, ధురు కుమార్ ఈ ప్రమాదంలో మరణించారని అధికారులు తెలిపారు.

తీవ్రమైన కాలిన గాయాలతో బాధపడుతున్న సంజయ్ కుమార్‌ను మెరుగైన చికిత్స కోసం రాంచీలోని దేవికమల్ ఆసుపత్రి నుంచి ఢిల్లీకి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చత్రా డిప్యూటీ కమిషనర్ కీర్తిశ్రీ జి మరియు ఎస్‌డిపిఓ శుభమ్ ఖండేల్వాల్ సంఘటనా స్థలానికి చేరుకుని ఏడుగురి మృతదేహాలను వెలికితీసినట్లు ధృవీకరించారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషించేందుకు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) బృందం రంగంలోకి దిగింది.

Next Story