మణిపూర్‌లో మళ్లీ హింస.. రాకెట్ దాడిలో ఇద్దరు చిన్నారుల మృతి, తల్లి పరిస్థితి విషమం!
మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రాకెట్ (మోర్టార్) దాడి జరిగినట్టు అనుమానిస్తున్నారు.
By - అంజి |
మణిపూర్‌లో మళ్లీ హింస.. రాకెట్ దాడిలో ఇద్దరు చిన్నారుల మృతి, తల్లి పరిస్థితి విషమం
మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రాకెట్ లేదా మోర్టార్ దాడి జరిగినట్టు అనుమానిస్తున్నారు. మొయిరాంగ్ ప్రాంతంలోని త్రోంగ్లావోబీ అవాంగ్ లైకాయ్ గ్రామంలో ఉన్న ఒక పౌరుడి ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు కొండ ప్రాంతాల నుండి శక్తివంతమైన పేలుడు పదార్థాన్ని ప్రయోగించారు. ఈ దాడిలో సరిహద్దు భద్రతా దళం (BSF) కానిస్టేబుల్ ఓయినం మలెంన్గాంబ భార్య బినిత (37), వారి ఐదేళ్ల కుమారుడు, ఐదు నెలల పసికందు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి ఇల్లు భారీగా దెబ్బతిన్నది.
క్షతగాత్రులను వెంటనే ఇంఫాల్‌లోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఇద్దరు చిన్నారులు మరణించారు. తల్లి బినిత పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ గ్రామం కొండ, లోయ ప్రాంతాల సరిహద్దులో ఉండటంతో, సాయుధ ముఠాలు ఎత్తైన కొండల నుండి సుదూర లక్ష్యాలను ఛేదించే ఆయుధాలను వాడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇక్కడ ఇలాంటి దాడులు జరిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
ఈ ఘటన పట్ల లోయ జిల్లాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆగ్రహించిన స్థానికులు బిష్ణుపూర్ మీదుగా చురాచంద్‌పూర్ వైపు వెళ్తున్న రెండు ఆయిల్ ట్యాంకర్లు, ఒక ట్రక్కుకు నిప్పు పెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో లోయ జిల్లాల్లోని పాఠశాలలను మూసివేశారు. స్థానిక ఎమ్మెల్యే తోంగం శాంతి ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. భద్రతా దళాలు ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తూ, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. శాంతియుతంగా ఉండాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.