మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. బావిలో పడ్డ కారు.. ఆరుగురు చిన్నారులతో సహా 9 మంది మృతి
మహారాష్ట్రలో ఒక శుభకార్యానికి వెళ్లి సంతోషంగా తిరిగి వస్తున్న ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మందిని విధి వంచించింది.
By - అంజి |
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. బావిలో పడ్డ కారు.. ఆరుగురు చిన్నారులతో సహా 9 మంది మృతి
మహారాష్ట్రలో ఒక శుభకార్యానికి వెళ్లి సంతోషంగా తిరిగి వస్తున్న ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మందిని విధి వంచించింది. నాసిక్ జిల్లాలోని దిండోరి తాలూకాలో శుక్రవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఆరుగురు చిన్నారులతో సహా మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండోర్ గ్రామానికి చెందిన ఈ కుటుంబం శివాజీనగర్‌లోని ఒక ఫంక్షన్ హాల్‌లో జరిగిన వార్షిక వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సునీల్ దత్తాత్రేయ దరగోడే అనే వ్యక్తి కారు నడుపుతుండగా, అదుపు తప్పి రోడ్డు పక్కనే నీటితో నిండి ఉన్న లోతైన బావిలోకి కారు దూసుకెళ్లింది.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక దళం, విపత్తు నిర్వహణ బృందాలు మరియు ఎన్డీఆర్ఎఫ్ (NDRF) ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే, బావి నిండుగా నీటితో ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్ చాలా కష్టతరంగా మారింది. గంటల తరబడి శ్రమించి క్రేన్ల సహాయంతో కారును బయటకు తీశారు. కారులో ఉన్న తొమ్మిది మంది మృతదేహాలను వెలికితీశారు. ప్రమాద సమయంలో కారు నుండి బయటపడి నీటిలో మునిగిపోయిన మరో బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మృతుల్లో సునీల్ దత్తాత్రేయ దరగోడే (34), ఆయన భార్య రేష్మ (30)తో పాటు 7 నుండి 14 ఏళ్ల మధ్య వయసున్న ఆరుగురు చిన్నారులు ఉన్నారు. మరణించిన పిల్లలంతా అప్పటివరకు ఫంక్షన్‌లో వేసుకున్న దుస్తుల్లోనే ఉండటం చూసి స్థానికులు, రెస్క్యూ సిబ్బంది కన్నీటిపర్యంతమయ్యారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. దిండోరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.