ఇస్రో సీనియ‌ర్ శాస్త్ర‌వేత్త‌పై విష‌ప్ర‌యోగం

Top ISRO scientist Tapan Misra claims he has poisoned three years ago,ఇస్రో సీనియ‌ర్ శాస్త్ర‌వేత్త‌పై విష‌ప్ర‌యోగం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Jan 2021 11:50 AM IST
ISRO scientist Tapan Misra news

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు చెందిన సీనియ‌ర్ శాస్త్ర‌వేత్త తపన్ మిశ్రా సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు. మూడేళ్ల క్రితం తనపై విష‌ప్ర‌యోగం జ‌రిగింద‌ని.. త‌న‌ను చంపేందుకు కుట్ర చేశార‌ని ఆరోపించారు. ఇంతకాలం గోప్యంగా ఉంచిన విషయాన్ని ఇప్పుడు బయటపెడుతున్నట్టు చెప్పారు. 'సుదీర్ఘ కాలం దాచి ఉంచిన రహస్యం' పేరిట పెట్టిన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో ఈ సంచలన విషయాన్ని తెలిపారు. తపన్ మిశ్రా ప్రస్తుతం ఇస్రోలో సీనియర్ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెలాఖరున పదవీవిరమణ చేయనున్నారు.

మే 23, 2017న బెంగ‌ళూరులోని ఇస్రో ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగిన ఓ ప్ర‌మోష‌న్ ఇంట‌ర్వ్యూ స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని చెప్పారు. తాను తిన్న దోశ‌, చ‌ట్నీలో ప్ర‌మాద‌క‌ర ఆర్సెనిక్ ట్రైఆక్సైడ్‌ను క‌లిపార‌ని ఆరోపించారు. ఈ కార‌ణంగా తాను అనారోగ్యానికి గురి అయ్యాయ‌ని చెప్పారు. విష ప్ర‌యోగం త‌రువాత శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు, చ‌ర్మంపై అసాధార‌ణ ద‌ద్దుర్లు, న్యూరాల‌జీ స‌మ‌స్య‌లు త‌లెత్తిన‌ట్లు చెప్పారు. కోలుకునేందుకు త‌న‌కు రెండేళ్లు ప‌ట్టింద‌న్నారు. ఇందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టును సైతం ఆయన పోస్ట్ చేయడం గమనార్హం. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు ఆర్సెనిక్ టాక్సికేషన్ ను మిశ్రాలో గుర్తించినట్టు ఈ రిపోర్ట్ స్పష్టం చేస్తుండటం గమనార్హం.

'గూఢచర్య ఆపరేషన్‌లో భాగంగా..మిలిటరీ, వ్యాపార రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఓ శాస్త్రవేత్తను తొలగించడమే ఈ దాడి వెనుక కారణం అయి ఉండొచ్చు' అని తపన్ పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం దర్యాప్తు జరపాలని కూడా ఆయన కోరారు. తపన్ మిశ్రా గతంలో ఇస్రో ఆధ్వర్యంలోని స్పేస్ అప్లికేషన్ సెంటర్‌కు డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ మొత్తం ఘటనపై భారత ప్రభుత్వం విచారణ జరిపించాలని ఆయన కోరారు. అయితే, విష ప్రయోగం జరిగిన మూడేళ్ల తరువాత తాను ఈ విషయాన్ని ఎందుకు వెల్లడిస్తున్నారన్న సంగతిని మాత్రం మిశ్రా పంచుకోకపోవడం గమనార్హం.




Next Story