విషాదం.. నీటి గుంతలో పడి మూడేళ్ల చిన్నారి మృతి

అధికారుల ఉదాసీనత, భద్రతా లోపాలు అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి.

By -  అంజి
Published on : 16 Feb 2026 11:50 AM IST

Greater Noida Pit Accident, Toddler Drowning Dalelgarh, Yuvaraj Mehta Techie Death, Greater Noida Authority Negligence, Open Water Pits Danger

విషాదం.. నీటి గుంతలో పడి మూడేళ్ల చిన్నారి మృతి

అధికారుల ఉదాసీనత, భద్రతా లోపాలు అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. గ్రేటర్ నోయిడాలోని దలేల్‌గఢ్ గ్రామంలో శనివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో మూడేళ్ల బాలుడు దేవాంశ్ నీటి గుంతలో పడి మృతి చెందాడు. బులంద్‌షహర్ జిల్లా సికింద్రాబాద్‌కు చెందిన అంజలి తన కుమారుడు దేవాంశ్ (3)తో కలిసి దలేల్‌గఢ్‌లోని తన పుట్టింటికి వచ్చింది. శనివారం స్థానిక ఆలయంలో నిర్వహించిన సామూహిక విందు (భండారా)కు కుటుంబం మొత్తం వెళ్లింది.

అక్కడ ఆడుకుంటూ వెళ్లిన దేవాంశ్, సమీపంలో వర్షపు నీరు నిండి ఉన్న ఒక లోతైన గుంతలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. కుటుంబ సభ్యులు గుర్తించి బయటకు తీసేలోపే బాబు ప్రాణాలు విడిచాడు. ఆ గుంత చాలా కాలంగా తెరిచే ఉందని, ఇటీవల కురిసిన వర్షాలకు నీరు నిండిపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన గుంతలను పూడ్చాలని గ్రేటర్ నోయిడా అథారిటీకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన సరిగ్గా నెల రోజుల క్రితం జరిగిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ యువరాజ్ మెహతా మరణాన్ని గుర్తు చేస్తోంది.

జనవరి 16న సెక్టార్ 150లో యువరాజ్ ప్రయాణిస్తున్న కారు దట్టమైన పొగమంచు వల్ల రోడ్డు పక్కనే ఉన్న 70 అడుగుల నీటి గుంతలో పడిపోయింది. సహాయక చర్యలు ఆలస్యం కావడంతో, దాదాపు రెండు గంటల పాటు కారు పైకప్పు మీద నిలబడి ప్రాణాల కోసం అరిచినా ఎవరూ కాపాడలేకపోయారు. చివరకు ఆ యువకుడు తన తండ్రితో ఫోన్‌లో మాట్లాడుతూనే నీటిలో మునిగి మరణించాడు. ఆ ఘటన తర్వాత కూడా అధికారులు గుంతల పట్ల కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం గమనార్హం. నిర్మాణ సంస్థలు, స్థానిక అధికారులు కేవలం హెచ్చరిక బోర్డులు లేదా బారికేడ్లు ఏర్పాటు చేసి ఉంటే ఈ రెండు ప్రాణాలు దక్కేవని స్థానికులు వాపోతున్నారు.

Next Story