నకిలీ వ్యాక్సిన్ తీసుకున్న నటి, ఎంపీకి అస్వస్థత..!
TMC MP Mimi Chakraborty Unwell with Dehydration.కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి ఉన్న ఏకైక
By తోట వంశీ కుమార్ Published on 27 Jun 2021 2:11 AM GMT
కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. అయితే.. ఇదే అదునుగా కొందరు కేటుగాట్లు నకిలీ వ్యాక్సిన్లతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా.. నకిలీ టీకా కార్యక్రమంలో పాల్గొని టీకా వేయించుకున్న టీఎంసీ ఎంపీ, నటి మిమి చక్రవర్తి శనివారం అస్వస్థతకు గురైయ్యారు. డీహైడ్రేషన్, కడుపునొప్పితో బాధపడడంతోపాటు ఆమె బీపీ కూడా పడిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు డాక్టర్లు చెప్పారు.
ఇంతకీ ఏమైందంటే.. కోల్‌కతా మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా నమ్మించిన దేవాంజన్ దేవ్ అనే వ్యక్తి ఇటీవల నగర సమీపంలో ఓ టీకా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. దీనికి ఎంపీ మిమి చక్రవర్తిని ఆహ్వానించాడు. ప్రజలకు సంబంధించిన విషయం కావడంతో ఈ కార్యక్రమానికి హాజరైన మిమి చక్రవర్తి.. టీకాపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు తాను కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు. అయితే.. టీకా వేయించుకున్నప్పటికి మొబైల్ కు మెసెజ్ రాకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చింది. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తులో అది నకిలీ వ్యాక్సినేషన్ కార్యక్రమం అని తేలింది. పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
అప్పటి నుంచి అతడు పంపిణీ చేసిన టీకాలపైనా అనుమానాలు మొదలయ్యాయి. ఆ టీకాలు వేయించుకున్న ఎంపీ శుక్రవారం వరకు బాగానే ఉన్నా.. శనివారం అనారోగ్యానికి గురైయ్యారు. అయితే.. ఆమె పరిస్థితికి టీకానే కారణం అని చెప్పడం తొందరపాటు అవుతుందని డాక్టర్లు అంటున్నారు. కాగా.. 32 ఏళ్ల మిమి గత కొంతకాలంగా లివర్ సంబంధిత జబ్బుతో బాధపడుతున్నారు.