లైంగిక వేదింపుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నిందితుడు బెయిల్ కోసం దరఖాస్తు చేశాడు. అత్యాచార దోషికి బెయిల్ ఇవ్వాలంటే.. కొన్ని షరతులు విధించింది మధ్యప్రదేశ్ హైకోర్టు. ఈ షరతులు ఏమిటంటే.. ఏ యువతినైతే అత్యాచారంచేశాడో ఆమె ఇంటికి వెళ్లి ఆమెతో రాఖీ కట్టించుకుంటే బెయిల్ ఇస్తామని చెప్పింది. దీనికి నిందితుడు ఒప్పుకోవడంతో అతడికి బెయిల్‌ను మంజూరు చేసింది మధ్యప్రదేశ్ హైకోర్టు. కాగా.. ఈ తీర్పుపై భారత అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇలాంటి కేసుల్లో అపోహాలు సృష్టించే ఉత్తర్వులు ఇవ్వొద్దని ఆదేశించిన న్యాయస్థానం.. ఆ తీర్పను కొట్టివేసింది.
అసలు మ్యాటర్ ఏంటంటే..?
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి గతేడాది తన పొరుగింట్లో ఉండే మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. గతేడాది ఏప్రిల్ నెలలో నిందితుడు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ పిటిషన్‌ను విచారించిన మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అందులో ఒకటి ఏంటంటే.. రక్షాబంధన్ రోజు ఆ బాధిత యువతి ఇంటికి వెళ్లి ఆమెతో రాఖీ కట్టించుకొని జీవితాంతం ఆమె రక్షణగా ఉంటానని హామీ ఇవ్వడం. అలా చెప్పి రూ.11 వేలు ఆమెకు ఇవ్వడంతోపాటు, ఆమె కొడుకుకు కొత్త బట్టలు, స్వీట్లు కోసం రూ.5 వేలు ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించింది. దీనిని సవాల్ చేస్తూ కొంత మంది మహిళా లాయర్లు సుప్రీంను ఆశ్రయించారు.