దారుణం.. నాలుగో తరగతి విద్యార్థిపై కంపాస్‌తో 108 సార్లు దాడి
స్కూల్ విద్యార్థుల మధ్య గొడవలు జరగడం సహజం. చిన్నచిన్న గాయాలు తగలించుకుని ఇంటికి వస్తుంటారు.
By Srikanth Gundamalla Published on 28 Nov 2023 9:15 AM ISTదారుణం.. నాలుగో తరగతి విద్యార్థిపై కంపాస్‌తో 108 సార్లు దాడి
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. స్కూల్ విద్యార్థుల మధ్య గొడవలు జరగడం సహజం. చిన్నచిన్న గాయాలు తగలించుకుని ఇంటికి వస్తుంటారు. కానీ.. ఎప్పుడో ఒక్కసారి తెలియకుండా పెద్ద గాయాలు అవుతాయి. దాడులు చేసుకుంటూ ఉంటారు. అయితే.. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రయివేట్ స్కూల్ విద్యార్థుల మధ్య జరిగిన గొడవ ఉద్రిక్తతకు దారి తీసింది. నాలుగో తరగతి విద్యార్థిపై ముగ్గురు తోటి విద్యార్థులు దాడి చేశారు. జామెట్రీ కంపాస్‌తో ఏకంగా 108 సార్లు పొడిచారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
మధ్యప్రదేశ్ ఇండోర్ నగరంలోని ఓ ప్రయివేట్ స్కూల్ ఈ సంఘటన చోటుచేసుకుంది. తోటి విద్యార్థులు దాడి చేసిన తర్వాత ఆ విషయాన్ని బాధిత విద్యార్థి ఎవరికీ చెప్పలేదు. ప్రిన్సిపల్‌కు చెప్పడానికి భయపడిపోయాడు. దాంతో.. ఇంటికి వచ్చే వరకూ ఎవరూ అతడిపై దాడిని గుర్తించలేదు. అయితే.. విద్యార్థి తల్లిదండ్రులు బాబు శరీరంపై గాయాలను చూసి ఆరా తీశారు. అప్పుడు ఆ బాధిత బాలుడు తల్లిదండ్రులకు విషయం మొత్తం చెప్పాడు. తోటి విద్యార్థులు జామెట్రీ కంపాస్‌తో పొడిచారని చెప్పాడు. దాంతో.. బాధిత బాలుడి తండ్రి నేరుగా పాఠశాలకు వెళ్లాడు. బాలుడిపై దాడి జరిగితే చూసుకోరా అంటూ యాజమాన్యాన్ని ప్రశ్నించారు.
ఘటన గురించి పూర్తిగా తెలుసుకునేందుకు సదురు తండ్రి సీసీటీవీ ఫుటేజ్‌ను కోరాడు. అయితే.. సీసీటీవీ విజువల్స్ ఇచ్చేందుకు స్కూల్ ప్రిన్సిపల్ నిరాకరించారు. ప్రిన్సిపల్ కూడా ఈ విషయాన్ని చూసి చూడనట్లు వదిలేయాని చెప్పాడని బాధిత బాలుడి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత అతను ఎయిర్‌డ్రోమ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. నవంబర్ 24వ తేదీన ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విద్యార్థుల మధ్య జరిగిన చిన్నగొడవ అనూహ్యంగా ఈ దాడికి కారణమైందని పోలీసులు కూడా చెబుతున్నారు. మరోవైపు బాలుడికి వైద్య పరీక్షలు జరిగాయని.. చిన్నారికి ప్రమాదం లేదని చెప్పారు. అయితే.. దాడికి పాల్పడ్డ విద్యార్తులంతా పదేళ్ల లోపువారే అని వెల్లడించారు. చట్టపరంగా ముందుకు వెళ్తామని పోలీసులు తెలిపారు.
మరోవైపు స్కూల్‌లో ఈ దాడి సంఘటనపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కూడా స్పందించింది. త్వరలో పిల్లలు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇప్పిస్తామని వెల్లడించింది. అసలు పిల్లలు అలా ప్రవర్తించడానికి గల కారణాలను తెలుసుకుంటామని.. తగిన విధంగా కౌన్సెలింగ్ ఇప్పిస్తామన్నారు. అంతేకాదు.. వీడియో గేమ్స్ పిల్లలపై ప్రభావం చూపుతాయని.. అలాంటేదమైనా ఉంటే విచారణలో తేలుస్తామన్నారు.