భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ రణ్‌వీర్‌లో ప్రమాదం జరిగింది. ముంబై డాక్‌యార్డ్‌లో నిలిచి ఉన్న ఐఎన్ఎస్ రణ్‌వీర్‌లో మంగళవారం సాయంత్రం పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఐఎన్‌ఎస్ రణ్‌వీర్‌లోని ఇంటర్నల్ కంపార్ట్‌మెంట్‌లో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ముంబైలోని ఐఎన్‌ఎస్ అశ్విన్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఘటన జరిగిన వెంటనే నౌకలోని ఇతర సిబ్బంది తక్షణమే స్పందించి పరిస్థితులు అదుపులోకి తెచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కాగా.. ఈ ప్రమాదం కారణంగా నౌకలోని కీలక మెటీరియల్ ఏమీ దెబ్బతినలేదని అధికారులు తెలిపారు. మృతి చెందిన వారి వివరాల్ని నౌకాదళం ఇంకా వెల్లడించలేదు. ఈ పేలుడు ప్రమాదవశాత్తూ సంభవించిందని నేవీ అధికారులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.
ఏప్రిల్ 21, 1986న ఐఎన్ఎస్ రణవీర్ ఇండియన్ నేవీలోకి ప్రవేశించింది. ప్రస్తుతం ఈ నౌక తూర్పు నౌకాదళంలో క్రాస్ కోస్ట్ ఆపరేషన్స్‌లో సేవలందిస్తోంది. సోవియట్ యూనియన్‌లో ఈ నౌకను నిర్మించారు. ఇందులో మొత్తం 325 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తుంటారు. ఈ యుద్ధనౌక గంటకు 35 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు.