బెంగళూరులో పేలుడు కలకలం.. ముగ్గురు మృతి
Three dead in blast in Bengaluru godown.బెంగళూరు నగరంలో విషాదం చోటు చేసుకుంది. చామరాజ్‌పేట రాయల్ సర్కిల్‌లో
By తోట వంశీ కుమార్
బెంగళూరు నగరంలో పేలుడు కలకలం సృష్టించింది. చామరాజ్‌పేట రాయల్ సర్కిల్‌లో గురువారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు పేలుడుకు గల కారణాలను అన్వేషిస్తున్నారు.
పేలుడు ధాటికి మృతదేహాలు తునాతునకలయ్యాయి. ఓ మృతదేహాం ఏకంగా 100 మీటర్ల దూరం ఎగిరిపడింది. రద్దీ ప్రాంతంలో పేలుడు జరగడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ ప్రమాదంపై ఓ అగ్నిమాపక అధికారి మాట్లాడుతూ.. మధ్యాహ్నం 12.10 గంటల ప్రాంతంలో ఓ ఇంట్లో సిలిండర్ పేలుడు సంభవించిందని ఫోన్ వచ్చిందని.. ఇక్కడకు వచ్చి చూసే సరికి పేలుడు ఓగోడౌన్‌లో జరిగినట్లు తెలిసిందన్నారు. మంటలను అదుపులోకి తెచ్చిన అనంతరం చూస్తే.. ముగ్గురు మృతి చెందినట్లు గుర్తించామని.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడితే వారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే చామరాజుపేట్ పోలీసులు, వెస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ సంజీవ్ పటేల్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితిని చూశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. కాగా.. పంకర్చర్ షాపులోని కంప్రెషర్ వల్లే పేలుడు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో పంక్చర్ షాపు యజమాని అస్లాం అక్కడిక్కడే మరణించారు.